ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : అధికార వైసిపి తరఫున ఎన్నికల వ్యూహాలు రచిస్తున్న ఐప్యాక్ టీమ్ రాజకీయ కార్యాచరణలోకి దిగింది. ఏడాదిగా నియోజకవర్గాల వారీగా వైసిపి తరఫున బలమైన అభ్యర్థులను కోసం సర్వే చేసి పార్టీ అధినేతకు సూచనలు చేస్తూ వచ్చిన ఐప్యాక్ సభ్యులు ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగారు. బాపట్లలోని వైసిపి రీజనల్ కో ఆర్డినేటర్లు, ఆరు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఇన్‌ఛార్జులతో కలిసి గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఓ ప్రైవేట్ హోటల్‌లో ఇష్టాగోష్టిగా నిర్వహించిన సమావేశంలో జిల్లాలో వైసిపికి ఉన్న బలాలు, బలహీనతల గురించి చర్చించారు. వైసిపి రీజనల్ కో ఆర్టినేటర్లు భూమన కరుణాకర రెడ్డి, బీద మస్తాన్ రావు, మంత్రి మేరుగు నాగార్జున రాష్ట ప్రభుత్వం గడచిన నాలుగేళ్ల చేపట్టిన అభివృధ్ది, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ సచివాలయ , వాలంటీర్ల వ్యవస్థ కారణంగా పార్టీ నేతలు ప్రజలకు దూరమైనట్లు తెలిపారు. కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది దురుసు ప్రవర్తన, విధులు సక్రమంగా నిర్వర్తించని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఐప్యాక్ టీం దృష్టికి తీసుకెళ్లారు. వైసిపి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులు వివక్షతకు గురయ్యారని, కొందరిపై కోపంతో అందరికి అన్యాయం జరిగినట్లు తెలిపారు. రాష్టంలో అందరి సంక్షేమం కోసం కృషి చేశామని చెబుతున్న నేతలు జర్నలిస్టుల కోసం ఏమి చేశారో చెప్పాలన్నారు. రాష్ట ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకు కరోనా సాయం కూడా అందలేదన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. అక్రిడెషన్లలో కోత పెట్టడం సరికాదన్నారు.దీంతో ఐప్యాక్ మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. రానున్న ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించనున్న ఐప్యాక్ సభ్యులు వైసిపి అభ్యర్థుల ఖారారు. క్షేత్రస్థాయిలో రాజకీయ వ్యూహాల రచనలతో వ్యవస్థలను వైసిపికి అనుకూలంగా మలిచే కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది.ఐప్యాక్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి వైసిపికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికలు, మీడియా ప్రతినిధులను ఆహ్వానించలేదు. ఈ సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసిపి చీరాల, పర్చూరు, అద్దంకి నియోజ వర్గాల ఇన్‌ఛార్జులు కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్, బాచిన కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.










