Aug 03,2023 00:23

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా వివిధ శాఖల అధికారులను ఎంపిక చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిటర్నింగ్‌ అధికారులుగా జాయింట్‌ కలెక్టర్లు, ఆర్‌డీవోలు, రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్లును నియమించారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా మున్సిపల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సహకార శాఖ అధికారులను ఎంపిక చేశారు.
రిటర్నింగ్‌ అధికారులు వివరాలు ఇలాఉన్నాయి. పెదకూరపాడుకు పులిచింతల ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, తాడికొండకు కోనేరు రంగారావు కమిటీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, మంగళగిరికి గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టరు, వేమూరుకు జిల్లా పరిషత్‌ సిఇఒ, రేపల్లేకు రేపల్లె ఆర్‌డీవో, తెనాలికి తెనాలి సబ్‌ కలెక్టర్‌, బాపట్లకు బాపట్ల జిల్లా జాయింట్‌ కలెక్టరు, ప్రత్తిపాడుకు గుంటూరు ఆర్‌డీవో, గుంటూరు పశ్చిమకు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నగరపాలక సంస్థ కమిషనర్‌, చిలకలూరిపేటకు పులిచింతల స్పెషల్‌ కలెక్టర్‌, మాచర్లకు పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, గురజాలకు గురజాల ఆర్‌డీవో, సత్తెనపల్లికి సత్తెనపల్లి ఆర్‌డీవో, నర్సరావుపేటకు నర్సరావుపేట ఆర్‌డీవో, వినుకొండకు పల్నాడు జిల్లా పులిచింతల స్పెషల్‌ కలెక్టర్‌ను ఎంపిక చేశారు.
ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు గుంటూరు లోక్‌సభకు గుంటూరు జిల్లా కలెక్టరు, నర్సరావుపేట లోక్‌సభకు జిల్లా జాయింట్‌ కలెక్టరు, బాపట్లకు ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారులుగా ఉండేవారు. డిప్యూటీ కలెక్టర్లు, ఇతర గ్రూపు-1 అధికారులు అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించేవారు. ఇప్పుడు ముగ్గురు జిల్లా కలెక్టర్లు ఉండటం వల్ల మూడు లోక్‌సభ స్థానాలకు వారే రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. అయితే ఈసారి ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లను కూడా మూడు అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారులుగా నియమించడం గమనార్హం. ప్రస్తుతం ఓటర్ల రివిజన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను ఎన్నికల కమిషన్‌ నియమించడం ద్వారా సార్వత్రిక ఎన్నికలకు ఒక అడుగు పడినట్టయింది. త్వరలో ఒకే స్థానంలో రెండేళ్లకు పైగా పనిచేసిన వారిని బదిలీ, తదితర అంశాలపై మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.