Nov 08,2023 21:03

ప్రజాశక్తి - భీమవరం
రానున్న సాధారణ ఎన్నికలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లకు సన్నద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. భీమవరం నియోజవర్గానికి సంబంధించి తాత్కాలికంగా ఎన్నికల సామగ్రిని భద్రపర్చేందుకు, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు, శిక్షణ తరగతుల నిర్వహణకు బుధవారం స్థానిక ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలోని వివిధ బ్లాక్‌ల్లో అనువైన భవనాల పరిశీలనతోపాటు, జిల్లాలో ఎన్నికల అనంతరం ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఇవిఎంలను భద్రపర్చడానికి స్ట్రాంగ్‌ రూముల, ఓట్ల లెక్కింపునకు అనువైన భవనాలను విష్ణు కాలేజీ నందు దాదాపు రెండు గంటల పాటు కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్‌పి యు.రవిప్రకాష్‌, జిల్లా జాయింటు కలెక్టరు ఎస్‌.రామ్‌ సుందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అలాగే రెండు కళాశాలల్లోని పీజీ సెంటరు, సెమినార్‌ రూమ్‌, ఆడిటోరి యంలు, విష్ణు కాలేజీ పబ్లిక్‌ స్కూల్‌, అన్నపూర్ణ క్యాంటీన్‌, సీతా పాలిటెక్నికల్‌ కళాశాలను పరిశీలించారు.అనంతరం కలెక్టరు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. భవనాలు ఖరారు చేసిన అనంతరం నివేదికను సిద్ధం చేసి ఎన్నికల కమిషన్‌కు ఆమోదం నిమిత్తం పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ కె.శ్రీనివాసులురాజు, తహశీల్దార్‌ వె.ౖరవికుమార్‌, కళాశాల ప్రతినిధులు, డిప్యూటీ తహశీల్దార్‌ సిహెచ్‌ విద్యాపతి పాల్గొన్నారు.
ఉండి:రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సామగ్రిని భద్రపర్చేందుకు అనువైన భవనాలను జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి బుధవారం పరిశీలించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ భవనం, గొడౌన్లను ఎన్నికల సందర్భంగా ఉండి నియోజకవర్గానికి సంబంధించి తాత్కాలికంగా ఎన్నికల సామగ్రి భద్రపర్చేందుకు, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు, శిక్షణా తరగతుల నిర్వహణకు అనువైన గొడౌన్‌ గదులను కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై ఎస్‌పితో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ కె.శ్రీనివాసులు రాజు, తహశీల్దార్‌ ఏడిద శ్రీనివాస్‌, డిప్యూటీ తహశీల్దార్‌ ఎస్‌విఎస్‌ నాయుడు, మండల సర్వేయరు రత్నవల్లి, ఎఎంసి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
నరసాపురం టౌన్‌ : బుధవారం స్థానిక వైఎన్‌ కళాశాల పిజి సెంటరు, సెమినార్‌ హాల్లో, ఆడిటోరియంను జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి పరిశీలించారు. రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి తాత్కాలికంగా ఎన్నికల సామగ్రి భద్రపర్చేందుకు, డిస్ట్రిబ్యూషన్‌ సెంటరు ఏర్పాటుకు, శిక్షణా తరగతుల నిర్వహణకు అనువైన గదులను జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి, జిల్లా ఎస్‌పి రవి ప్రకాష్‌, జెసి ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎం.అచ్యుత అంబరీష్‌, తహశీల్దార్‌ ఎస్‌ఎం.ఫాజిల్‌, రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.