
పార్వతీపురం: సాధారణ ఎన్నికలు - 2024 నిర్వహణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకె మీనా అన్నారు. సాధారణ ఎన్నికలు - 2024 పై జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధానాధికారి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని పక్కాగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు - 2024 నిర్వహణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. జిల్లాలో నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. 1031 పోలింగ్ కేంద్రాలు, 154 రూట్లు, 154 మంది సెక్టోరల్ అధికారులు, 154 మంది సెక్టోరల్ పోలీసు అధికారులు, 440 మంది మైక్రో అబ్జర్వర్లు, 1237 మంది ప్రిసైడింగ్ అధికారులు, 4948 మంది పోలింగ్ అధికారులు, 20 మంది నోడల్ అధికారులు అవసరమని గుర్తించామని, ఆ మేరకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని వివరించారు. 1750 మంది భద్రతా సిబ్బంది అవసరమని అంచనా వేశామని ఆయన చెప్పారు. 381 వాహనాలు ఉండాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, ఆ మేరకు వాహనాలు జిల్లాలో లభ్యం కాగలవని అన్నారు. సిబ్బంది శిక్షణ, ఎన్నికల సామగ్రి పంపిణీ, సామగ్రి స్వీకరణ, స్ట్రాంగ్ రూం, లెక్కింపు కేంద్రాలను ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మద్యం, డ్రగ్స్ పంపిణీ జరగకుండా పటిష్టంగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టామనిపేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు 120 కిలో మీటర్ల మేర ఉందని, జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 190 మొబైల్ టవర్లు మంజూరయ్యాయని, నిర్మాణాలు ప్రారంభమైన ఇప్పటికే దాదాపు 35 టవర్లు పని చేస్తున్నాయని తెలిపారు. సమావేశంలో ఎస్‌పి విక్రాంత్ పాటిల్, డిఆర్‌ఒ జె.వెంకటరావు, ఎఎస్‌పి డాక్టర్ ఒ.దిలీప్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.