Feb 22,2023 00:48
మాట్లాడుతున్న బిసి నాయకులు రవికుమార్‌

ప్రజాశక్తి-బాపట్ల: బీసీ కులాల రాజకీయ ఆర్థిక విద్య అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్‌ అన్నారు. మంగళవారం బాపట్ల పట్టణం నరాల శెట్టిపాలెంలో ప్రముఖ న్యాయవాది అంగలకుదురు టి నటరాజన్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రవికుమార్‌ మాట్లాడారు. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 ఎమ్మెల్సీ సీట్లు బీసీలకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, కొన్ని బిసి కులాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రజక, శాలివాహన, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయిస్తానని, పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చోన హామీ నెరవేర్చకపోవడం బాధాకరమని అన్నారు. గత ప్రభుత్వానికి బీసీల పట్ల సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో బీసీలు జగన్మోహన్‌ రెడ్డి వెంట నిలిచారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆయా కార్పొరేషన్ల విధి నిర్వహణకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపట్ల ప్రభుత్వ తీరును ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మద్దిబోయిన తాతయ్య, న్యాయ సలహాదారుడు అంగలకుదురు టి నటరాజన్‌, కార్యదర్శి మారం రవికుమార్‌, బాపట్ల నియోజకవర్గం అధ్యక్షులు పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, యువజన విభాగం నియోజవర్గ అధ్యక్షుడు ఎన్‌ఎస్‌పి రాజు, మద్దసాని శ్రీను పాల్గొన్నారు.