ప్రజాశక్తి- రాజమహేంద్రవరం మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎపి మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజనం కార్మికులు సోమవారం ధర్నా చేపట్టారు. జిల్లాలోని పలు మండలాల నుంచి కార్మికులు కలెక్టరేట్‌కి చేరుకుని తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నినదించారు. ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వింత పత్రాన్ని కలెక్టర్‌కి అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు చిట్టా బేబీ మాట్లాడుతూ పాతికెళ్ళు పైబడి మధ్యాహ్నం భోజనం కార్మికులుగా పనిచేస్తున్నా ప్రభుత్వం కేవలం రూ.3000 మాత్రమే వేతనంగా ఇస్తుందన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు మాత్రం పాతాళంలోనే ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మధ్యాహ్న భోజనం కార్మికులకు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వారి ఊసే లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాగిజావ కాయడానికి అదనపు గ్యాస్ బండ ఇవ్వాలని, వంట పాత్రలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రాజకీయ తొలగింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు నాగమణి, అమ్మాజీ, సత్యవతి, సత్యవతి, మిడ్డే మీల్ కార్మికులు పాల్గొన్నారు.










