Oct 30,2022 21:35

ఎపి మున్సిపల్‌ ఉద్యోగుల జిల్లా మహాసభలో నేతలు
ప్రజాశక్తి - ఏలూరు

            మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఎన్నికల హామీకి అనుగుణంగా పర్మినెంట్‌ చేయాలని, ఇంజినీరింగ్‌ విభాగం సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ రానున్న కాలంలో మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులను ఐక్యం చేసి రాష్ట్రవ్యాప్త పోరాటాలు నిర్వహిస్తామని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆ యూనియన్‌ ఏలూరు జిల్లా నాలుగో మహాసభ స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పని చేశారని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. పిఆర్‌సి ప్రకారం కనీస వేతనం రూ.20 వేలు కరువు భత్యం ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు వేలు కోత కోసి అన్యాయం చేసిందన్నారు. ఇంజినీరింగ్‌ విభాగం సిబ్బందికి హెల్త్‌ అలవెన్సులు అమలు చేయకుండా వివక్ష చూపిస్తుందన్నారు. ఇంజినీరింగ్‌ విభాగం సిబ్బందికి స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ జీతాలు ఇవ్వాలని, రిస్కు అలవెన్స్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు, బైండోవర్‌ కేసులు పెట్టి వేధిస్తోందని, కనీసం ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా కాలరాస్తుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్‌రెడ్డి మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడగడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. లేనిపక్షంలో మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టడం ఖాయమని హెచ్చరించారు. మహాసభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడారు. తొలుత సిఐటియు జెండాను యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.సోమయ్య ఎగురవేసి మహాసభను ప్రారంభించారు. ఈ మహాసభకు అంగుళూరు జాన్‌బాబు, ఆర్‌.బాలరాజు, లావేటి కృష్ణారావు, జి.నాగరాజు, వి.పద్మ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఇటీవల మరణించిన మున్సిపల్‌ కార్మిక నాయకులు వెంకట్రావు, లావేటి వెంకట ప్రసాద్‌, బట్టు శ్రీనివాసరావులకు సంతాపం తెలిపింది. గత మూడు సంవత్సరాల కాలంలో నిర్వహించిన కార్యక్రమాల రిపోర్టును యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సోమయ్య ప్రవేశపెట్టారు. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల నుండి హాజరైన ప్రతినిధులు చర్చించి ఆమోదించారు. అనంతరం బి.సోమయ్య జిల్లా గౌరవాధ్యక్షులుగాను, ఆర్‌.నాగరాజు జిల్లా అధ్యక్షులు, అంగుళూరు జాన్‌బాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మరో పది మంది ఆఫీస్‌ బేరర్స్‌గా, 15 మంది కమిటీ సభ్యులుగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.