కడప అర్బన్ : గ్యాస్ సిలిండర్ ధరలు నాలుగేళ్లలో ఎనిమిది సార్లు పెంచి ఒక్కసారిగా రూ. 200 తగ్గించడం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎత్తుగడ అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పేర్కొన్నారు. సమరభేరిలో భాగంగా బుధవారం బుధవారం ఐటిఐ సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీలు, అధిక ధరలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్యాస్ సిలిండర్ తగ్గించి మహిళ పట్ల మోడీ కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. సబ్సిడీలకు కోతపెట్టి, సిలిండర్ ధర ఏకంగా రూ. 800లకు పెంచి సామాన్యులపై మోయరాని భారం మోపి ఇప్పుడు కొంత మేర తగ్గించి ప్రజలను వంచించారని వాపోయారు. ప్రజా ఆందోళన ఒత్తిడి మేరకు ప్రభుత్వం గాస్ ధర కొద్ది మేర కైనా తగ్గించక తప్పలేదని పేర్కొన్నారు. వంటగ్యాస్‌ను రూ. 400 తగ్గించి , ఇప్పటివరకు రద్దు చేసిన సబ్సిడీ మొత్తాన్ని ప్రజల ఖాతాల్లో జమ చేసి తన చిత్తశుద్ధినీ రుజువు చేసుకోవాలని చెప్పారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానని 2014లో హామీ ఇచ్చిన బిజెపి ,మోడీ నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ,అంబానీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ధరలు పెంచి దేశ ప్రజలను బలి చేశారు. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని పేర్కొన్నారు. కార్పొరేట్లకు వూడిగం చేస్తూ సంస్కరణల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని, వైసిపి సర్కార్ పేదల ప్రభుత్వంగా చెబుతూ ధరలు, పన్నులు పెంచి ప్రజల గొంతు కోసిందని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని నమ్మబలికి నేడు సర్దుబాటు పేరుతో భారాలు వేయటం మోసపూరితమని వెల్లడించారు. కార్పొరేట్ల దోపిడీ, పాలకుల అవినీతి అరికడితే విద్యుత్తును చౌకగా అందించవచ్చని, బియ్యం మొదలు కూరగాయల వరకు ధరలన్నీ పెరుగుతున్నా ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని వాపోయారు. ప్రజాపంపిణీ వ్యవస్థను ఉద్దేశ పూర్వకంగా దెబ్బ తీస్తున్నారని, కందిపప్పు, పామాయిల్ తదితర నిత్యవసర సరుకుల సరఫరా నిలిపివేశారు. మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని ఊరించి ఉన్న ఉపాధికే ఎసరు పెట్టారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి జగన్ యువతను వంచించారరన్నారు. చంద్రబాబు దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మోడీకి భజన చేయటం సిగ్గుచేటని, హోదాపై విభేదించానని చెబుతున్న చంద్రబాబు నాలుగేళ్లలో హోదాపై నోరు మెదపలేదని, సిపిఎం ధరలు, నిరుద్యోగంపై దేశవ్యాప్త ఆందోళన సాగిస్తోందని, సెప్టెంబర్ 4న ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి నిరసన తెలుపుతామని చెప్పారు. ప్రజలందరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామమోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్, శ్రీనివాసులురెడ్డి, కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి, పాపిరెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, ఓబులేసు, జమీల, షకీల, రామకృష్ణారెడ్డి, ఎం.ఆర్.నాయక్, షాకీర్ పాల్గొన్నారు.
బద్వేల్ : స్థానిక నాలుగు రోడ్ల సెంటర్‌లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరిచడంలో, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ఆదేశాలను తూచతప్పకుండా పాటిస్తున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రం ఎదుట మోకరిల్లి స్మార్ట్‌మీటర్లు అమరుస్తూ ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్నారని విమర్శించారు. దశలవారి ఆందోళనలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కె. శ్రీను కార్యదర్శి వర్గ సభ్యులు చాంద్ బాషా, సిఐటియు కార్యదర్శి బాబు, పట్టణ కమిటీ సభ్యురాలు మోక్షమ్మ, ఆనంతమ్మ, సిఐటియు నాయకులు రమణ, ఓబులేసు, రాజగోపాల్, సభ్యులు చిన్ని, నాగార్జున, శరీఫ్, బాబయ్య, చిన్నయ్య గౌతమి బాలమ్మ ,రత్నమ్మ, మస్తాన్ బీ, డివైఎఫ్‌ఐ నాయకులుఆంజనేయులు గురయ్య సురేంద్ర సురేష్ పాల్గొన్నారు.










