Aug 14,2023 18:23

కలెక్టర్‌ పి.ప్రశాంతి
ప్రజాశక్తి - ఉండి
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలిసిపూడి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మూడు పంచాయతీ సర్పంచులు, 28 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మూడో వార్డుకు జరగాల్సిన ఎన్నికలను ఆగస్టు 19వ తేదీన నిర్వహించి, అదేరోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. కలిసిపూడి పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ స్టేషన్‌లోపలికి, బయటకు రాకపోకలకు వీలుగా అదనపు ద్వారంను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జివికె మల్లికార్జునరావు, పంచాయతీ ఎన్నికల జిల్లా నోడల్‌ అధికారి ఎన్‌విఎస్‌.శివప్రసాద్‌ యాదవ్‌, ఎంపిడిఒ ఎవి.అప్పారావు, ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ ఎస్‌విఎస్‌.నాయుడు పాల్గొన్నారు.