Feb 18,2021 06:41

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జన్మదినాన్ని ఈ సంవత్సరం గుర్తించే విధంగా భిన్నమైన రీతులలో నిర్వహించారు. ఆయన చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు. ఆయన జన్మదినాన్ని 'పరాక్రమ దివస్‌'గా నిర్వహించాలని ప్రకటించారు. హౌరా కలకత్తా మెయిల్‌ పేరును 'నేతాజీ ఎక్స్‌ప్రెస్‌'గా మార్చాలని రైల్వే మంత్రి ప్రకటించారు. మమతా బెనర్జీ దీనికి భిన్నంగా, ఆయన జన్మదినాన్ని 'దేశ్‌ నాయక్‌ దివస్‌'గా నిర్వహిస్తామని ప్రకటించారు. నోటి మాటల ప్రచారంతో, సోషల్‌ మీడియా ద్వారా బిజెపి, వారి పరివారం, బోస్‌ హిందూత్వను సమర్ధించాడని, కాంగ్రెస్‌ ఆయనను గౌరవించలేదని అబద్ధాలను వ్యాప్తిచేస్తున్నారు.


జనవరి 23వ తేదీన, కోల్‌కతాలో బోస్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని తలపెట్టిన ఒక బహిరంగ సభలో, మమతా బెనర్జీ మాట్లాడడానికి ఉపక్రమించినప్పుడు బిజెపి లోని కొంత మంది మద్దతుదారులు 'జైశ్రీరామ్‌' నినాదాలు చేయడంతో, తనను అవమానించారని భావిస్తూ మాట్లాడకుండానే సభను విడిచి వెళ్లారామె. 'జైహింద్‌' లాంటి నినాదాలే బోస్‌కు ఇష్టమైనవి.. ప్రీతిపాత్రమైనవి. ఈ సంఘటనలన్నీ రాబోయే పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడానికి బిజెపి చేసే వివిధ రకాల ప్రయత్నాల్లో భాగంగానే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. జాతీయోద్యమ కాలంలో, పేరుగాంచిన నాయకులను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఈ మధ్య కాలంలో సుభాష్‌ చంద్రబోస్‌ ముందు వరుసలోకి తీసుకుని వచ్చారు.


ఆయన ముఖ్యమైన జాతీయ నాయకుడే కాక, పశ్చిమ బెంగాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. ఇంతవరకు బిజెపి నేతాజీని గూర్చి ఇప్పుడు మాట్లాడినవిధంగా ఏనాడు మాట్లాడలేదు. వాస్తవం ఏమంటే నేతాజీ భావజాలం మొత్తం బిజెపి అనుసరిస్తున్న భావజాలానికి పూర్తిగా విరుద్ధమైనది. వాస్తవాన్ని మరుగు పరుస్తూ నేతాజీ భావజాలం ప్రస్తుత భారత పాలకవర్గాల భావజాలానికి అనుకూలమైనదని చూపించడానికి గట్టి ప్రయత్నమే జరుగుతున్నది. సోషలిజం, ప్రజాస్వామ్యం, మత సామరస్యం కోసం నేతాజీ నిలబడ్డాడు. కానీ ప్రస్తుత అధికార పార్టీ హిందూ జాతి కోసం కలలు కంటూ, విభజన రాజకీయాలను అమలు చేస్తూ తన చర్యల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నది.
కాంగ్రెస్‌ పార్టీతో ఆయనకు ఉన్న విభేదాలు, బేదాభిప్రాయాలు స్వాతంత్య్రం సాధించటానికి అనుసరించవలసిన పద్ధతులకు సంబంధించినవిగానే ఉండేవి. ఆయన రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులుగా పనిచేశారు. అభిప్రాయభేదాలు ప్రధానంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ, మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా క్విట్‌ ఇండియా ఉద్యమం కోసం ప్రణాళికలు రచించారు. బోస్‌ ఈ కాలంలోనే బ్రిటన్‌కు శత్రువులైన జర్మనీ, జపాన్‌తో కలిసి ఒప్పందం కుదుర్చుకొని బ్రిటన్‌ వారిని వెళ్లగొట్టాలని కోరుకున్నాడు. అధిక శాతం కాంగ్రెస్‌ కేంద్ర కమిటీ సభ్యులు గాంధీజీ నిర్ణయంతో ఏకీభవించారు. పటేల్‌, నెహ్రూ లాంటి నాయకులు కూడా బోస్‌ ప్రతిపాదించిన వ్యూహాన్ని పూర్తిగా వ్యతిరేకించారు.


ఇప్పటికీ అది ఎత్తుగడలకు సంబంధించిన తేడానే. కాంగ్రెస్‌ పార్టీ, బోస్‌ ఉభయులూ కూడా స్వాతంత్య్ర సముపార్జన కోసమే ఉన్నారు. ఇద్దరి లక్ష్యం భారతదేశానికి స్వాతంత్య్ర సముపార్జనే. ఇదే సమయంలో హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌...బ్రిటిష్‌ ప్రభుత్వ యుద్ధ ప్రయత్నాలకు మద్దతునిచ్చాయి. హిందూ మహాసభకు చెందిన సావర్కర్‌ బ్రిటిష్‌ సైన్యాన్ని బలోపేతం చేయడంలో ముందు భాగాన ఉండడమే కాక భారతీయులను బ్రిటిష్‌ సైన్యంలోకి చేర్చడంలో వారికి సహకరించాడు. బోసు దీనికి భిన్నంగా సింగపూర్‌లో బ్రిటిషు సైన్యాన్ని ఎదుర్కొనే లక్ష్యంతో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించినప్పటికీ, ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌ ఆరాధకునిగానే కొనసాగాడు. గాంధీ నెహ్రూల విషయంలో స్పష్టంగా చూసినట్లయితే గాంధీజీని 'జాతిపిత'గా సంభోదించాడు. ఐయన్‌ఎ ను ఏర్పాటు చేసే సమయంలో గాంధీజీ ఆశీస్సులను కోరాడు, పొందాడు. అదేవిధంగా రెండు ఐయన్‌ఎ బ్రిగేడ్లకు గాంధీ, నెహ్రూ పేర్లు పెట్టాడు.


ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల, సోషలిజం అనే భావన పట్ల హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రారంభం నుండి పూర్తి వ్యతిరేకతో ఉన్నాయి. బోసు నికార్సయిన సామ్యవాది. తాను కాంగ్రెసుతో ఉన్నప్పుడు నెహ్రూతో, సోషలిస్టులతో కలిసి జాతీయోద్యమంలో సోషలిస్టు భావాలను పొందుపరిచేందకు కృషి చేశాడు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ప్లానింగ్‌ కమిషన్‌ ఉండాలని దఢంగా వాదించేవాడు. యాదృచ్ఛికంగా, స్వాతంత్య్రం తరువాత ఏర్పరచిన ప్రణాళికా సంఘాన్ని...బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రద్దు చేసి 'నీతి ఆయోగ్‌'తో పునర్‌ నిర్మాణం చేసింది. తాను కాంగ్రెసును వీడిన తర్వాత సోషలిస్టు భావాలతో కూడిన ఫార్వర్డ్‌ బ్లాక్‌ను స్థాపించారు. పశ్చిమ బెంగాల్‌ను దశాబ్దాలుగా పరిపాలించిన వామపక్ష సంకీర్ణ ప్రభుత్వంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ భాగస్వామిగా కొనసాగింది.


కాంగ్రెస్‌ కూడా ఐయన్‌ఎ ను సానుకూల దృక్పథంతోనే చూసేది. రెండవ ప్రపంచ యుద్ధ ముగింపు తరువాత సంబంధిత సిపాయిలు, అధికారులను కోర్టులలో విచారించారు. ఇతరులతో పాటు భూలాభారు దేశారు, అదేవిధంగా కాంగ్రెస్‌ నాయకుడైన జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా ఐయన్‌ఎ కేసు కోసం వాదించారు. ఆసక్తికర విషయమేమంటే ధీరులైన, సాహసవంతులైన సిపాయిల కేసుల కోసం నికరంగా పోరాడేందుకు నెహ్రూ లాయర్‌ గౌను ధరించాడు.


అందరూ గమనించాల్సిన విషయం ఏమంటే, హిందూ మహాసభకు చెందిన శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ముస్లింలీగ్‌ భాగస్వామిగా ఉన్న బెంగాల్‌ ప్రభుత్వంలో పని చేశాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచివేసే సమయంలో, క్విట్‌ ఇండియా ఉద్యమం గురించి బెంగాల్‌లో ఆందోళన పడాల్సిన అవసరం లేదని వారితో తాను సవ్యంగానే డీల్‌ చేస్తానని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బ్రిటిష్‌ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. దీనితో పాటుగా హిందూ మహాసభకు చెందిన సావర్కర్‌ బ్రిటిష్‌ సైన్యం బలోపేతం కావాలని కోరుకున్నాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య నాయకుడైన గోల్వాల్కర్‌ తమ విభాగాలకు తమ రోజువారీ కార్యక్రమాలకు కట్టుబడి ఉండాలని బ్రిటిష్‌ వారికి కోపం తెప్పించే ఎలాంటి పనులు చేయవద్దని సర్క్యులర్‌ జారీ చేశాడు.


హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి సంస్థల ప్రధాన ఎజెండా హిందూ రాజ్య స్థాపన. ముస్లిం లీగ్‌, హిందూ మహాసభ లాంటి మతపరమైన రాజకీయాలను సుభాష్‌ చంద్రబోస్‌ పూర్తిగా వ్యతిరేకించాడు. ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మత సంస్థల ద్వంద్వ సభ్యత్వాన్ని నిరోధించాడు. అటువంటి వారు ఎక్కువ కాలం కాంగ్రెస్‌ కమిటీలలో ఉండలేక పోయారు. బెర్లిన్‌ నుండి ఇచ్చిన రేడియో సందేశంలో బ్రిటిష్‌ వారికి అనుకూలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్మాణం చేపట్టడాన్ని విమర్శించాడు. ఆయన ఉద్దేశ్యంలో మతపరమైన సంస్థల రాజకీయాలు రైతాంగం, శ్రమ జీవుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటాయని భావించాడు. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ బెంగాల్‌ హిందూ మహాసభలో చేరడాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించాడు.


జాతికి గౌరవం తెచ్చిన జాతీయ ప్రముఖులైన వివేకానందుడు, సర్దార్‌ పటేల్‌ లాంటి వారిని తమ భావాలకు అనుగుణంగా ఉన్నారని, లబ్ధి పొందేందుకు...హిందూ జాతీయవాదులు తరచుగా ప్రయత్నిస్తున్నారు. గాంధీ, నెహ్రూలతో భిన్నాభిప్రాయాలు ఉన్న జాతీయ ప్రముఖులపై బిజెపి దృష్టి పెడుతుంది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, హిందూ జాతీయవాదుల భావజాలానికి వ్యతిరేకత ఉన్న ఒక గొప్ప జాతీయోద్యమ నాయకుడిని తమ భావజాలానికి దగ్గరగా ఉన్నాడని ప్రచారం చేస్తున్నారు. హిందూ ముస్లింల ఐక్యతా భావనకు కట్టుబడి ఉండే ఆయన ఒక నిజమైన సోషలిస్టు. ఆయన బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడినపుడు, హిందూ జాతీయవాదులు బ్రిటిష్‌ వారికి మద్దతు ఇచ్చారు. ఆయన గాంధీని జాతిపితగా పిలిస్తే, హిందూ జాతీయవాదులలో ఒక వ్యక్తి గాంధీజీని హత్య చేశాడు.
                           * రామ్‌ పునియాని (రచయిత బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విశ్రాంత ఆచార్యుడు)