కాలం కనుబొమల మీద
అలల్లా పరిచయాలు కదులుతుంటాయి.
కొన్ని లెక్కలు సరిపడి ముడిపడతాయి
కొన్ని నిజాలు జారిపడి వేరుపడతాయి
కృత్రిమ పరిమళాల మధ్య
బంధాలు నలిగిపోతున్నాయి.
కొన్ని ఆర్థిక తూకాల్లో
తేలియాడుతుంటాయి.
ప్రతి చిరునవ్వు వెనుక
ఒక వినియోగపు ప్రణాళిక
పరచుకుంటుంది.
అంతా పరాయీకరణలో
విలవిలలాడుతున్నాం.
ఒంటరి పోరాటంలో
అవాంతరాల మధ్య
శక్తిగా వెలగటం
కార్యదీక్షకు సాక్ష్యం పలుకుతుంది.
సంతోషం పూయిస్తూ
ప్రయత్నాలు నడిపిస్తూ
ముందుకు ఉరకటమే ఆదర్శం.
ఎన్ని దుఃఖాలు
ఇంకా ముసురుతున్నా
కాగే లక్ష్యం మీద
వేసే అడుగులు పరుగులు తీస్తుంటాయి
కలలు పూసేవరకూ..!
గవిడి శ్రీనివాస్
70192 78368