సముద్రమంత నిర్లక్ష్యానికి
కలల తీరాలెన్నో కొట్టుకుపోతున్నాయి
కుటుంబం కోటను
కుదిపి కుదిపి వదిలిపెట్టిన వాయుగుండం
ఏడాది గడిచాక
తుపానై మళ్ళీ విరుచుకుపడింది
జంటభుజాలు ఒంటరివయ్యాయి
కాంతిపుంజాలు కనుమరుగై
కనబడని చీకటిపాములు
ఇంటిని ఆక్రమించుకున్నాయి
గోడలనిండా కన్నీటి నదులే
గది గదికో ప్రశ్న చొప్పున వెంటాడుతున్నాయి
రేకులన్నీ రాలి
తావి ఒక్కటే మిగిలిన వ్యధలది
మరో కథ
గుండెలు ముక్కలవుతున్న చప్పుడు
నిశ్శబ్దంలో అణుబాంబులా పేలుతోంది
మరణంతో కాలానికి
ఎన్నేళ్ళ ఒప్పందం కుదిరిందో
దస్తూరి సంతకం చేసిన దుఃఖాన్నే అడగాలి!
- సాంబమూర్తి లండ
96427 32008