Aug 07,2021 06:31

     ''అనుమానాస్పద ఆధిపత్యం''.. విశ్వక్రీడా యువనికపై భారత హాకీ జైత్రయాత్ర సాగించిన కాలంలో క్రీడాలోకం నివ్వెరపాటుతో వ్యక్తం చేసిన సందేహమది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అవసరమైన బూట్లు కూడా లేని దుస్థితి నుంచి వరుస విజయాలతో హాకీలో మకుటం లేని మహరాజుగా వెలుగొందింది. 1928 నుంచి 1956 దాకా భారత హాకీ చరిత్రలో అదొక స్వర్ణ యుగం. ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, ఒక రజితం, రెండు కాంస్యాలు, ఒకసారి ప్రపంచ ఛాంపియన్‌గా, మూడు సార్లు ఏసియాడ్‌ ఛాంపియన్‌గా తిరుగులేని శక్తిగా నిలిచిన భారత హాకీ జట్టు చివరిసారి 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించింది. ఆ తరువాత నాలుగు దశాబ్దాల పాటు పతకాలు లేని ఎడారిలా మారింది. హాకీ క్రీడలో వచ్చిన ఆధునిక పోకడలను అందిపుచ్చుకోవడంలో వెనుకబాటుతనం ఇందుకు ఒక కారణం. మళ్లీ ఇన్నాళ్లకు టోక్యో వేదికపై భారత్‌ ఒక కాంస్యం సాధించడం, మహిళల హాకీ జట్టు కాంస్యాన్ని కొంచెంలో చేజార్చుకున్నా చక్కని పోరాట పటిమతో నూట ముప్పై కోట్ల భారత ప్రజల హృదయాలను గెలుచుకుంది. జాతీయ క్రీడ హాకీలో భారత జట్టు మళ్లీ తన సత్తా చాటుతుందనడానికి ఇదొక సూచిక. ఇందుకు మహిళా, పురుష హాకీ ఆటగాళ్లను అభినందించాలి. భారత దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవలేదు. వారిలో ప్రతిభను గుర్తించి పదును పెట్టేందుకు నిర్దిష్ట ప్రణాళికలు కానీ, క్షేత్ర్ర స్థాయిలో ప్రోత్సాహం కానీ, క్రీడా మౌలిక సదుపాయాలు కానీ ఉండడం లేదు. దీనికి తోడు వ్యక్తిగత ప్రధానమైన ఆటలకు ప్రాధాన్యత పెరిగిపోవడం, క్రీడల కార్పొరేటీకరణ, క్రీడల పట్ల పాలకుల అంతులేని నిర్లక్ష్యం ప్రపంచంలో జనాభా పరంగా రెండవ అతి పెద్ద దేశంగా ఉన్న భారత్‌..టోక్యోలో ఒక్క స్వర్ణం కూడా సాధించలేని దుస్థితికి నెట్టాయనేది నిష్టుర సత్యం.
       ఇంతటి అననుకూల పరిస్థితిలోనూ భారత హాకీ జట్లు టోక్యోలో అద్భుతంగా రాణించాయి. పురుషుల హాకీలో బలమైన జర్మనీని 5-4తో ఓడించి కాంస్యాన్ని దక్కించుకోవడంతో పతకం కోసం నాలుగు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. మహిళల హాకీలో కాంస్యం కోసం జరిగిన పోరులో భారత అమ్మాయిలు దృఢమైన బ్రిటన్‌ జట్టుతో తలపడి 2-0తో ఒక దశలో బాగా వెనుకబడింది. అంతటి ఒత్తిడిలోనూ చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో పోరాడి చివరికి 3-4తో ప్రత్యర్థి చేతిలో ఓటమి చవిచూసింది. కాంస్యం చేజారినా భావి భారత క్రీడాకారులకు స్పూర్తిదాయకంగా నిలిచింది. అందుకనే అటు పార్లమెంటు ఇటు ప్రజానీకం జేజేలు పలుకుతోంది.
     హాకీ జట్లు సాధించిన ఈ మహోన్నత విజయానికి ఒడిషా ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం మరువలేనిది. సాధారణంగా స్పాన్షర్‌షిప్‌ అనగానే కార్పొరేట్‌ కంపెనీలు ముందుంటాయి. క్రికెట్‌, టెన్నిస్‌ లాంటి క్రీడలను స్పాన్సర్‌ చేసేందుకు పోటీ పడే కంపెనీలు, జాతీయ క్రీడ హాకీ విషయానికొచ్చేసరికి ముఖం చాటేశాయి. అటు ప్రయివేటు కంపెనీలు ఆదరించక, ఇటు కేంద్ర ప్రభుత్వమూ పట్టించుకోని స్థితిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి హాకీకి స్పాన్సరర్‌గా వ్యవహరించడం ఒక మంచి పరిణామం. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్వతహాగా హాకీ క్రీడాకారుడు కావడం ఈ క్రీడ పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపడానికి కారణం కావచ్చు. క్రీడలకు బడ్జెట్‌లో నిధులు తెగ్గోసిన మోడీ సర్కార్‌ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అంతర్జాతీయ స్టేడియాలకు తమ పేర్లు తగిలించుకోవడంలోనూ, అవార్డుల పేర్లను మార్చడంలోనూ చూపుతున్న శ్రద్ధ క్రీడాకారులను ప్రోత్సహించడంలో కేంద్రం చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలందిస్తున్న చేయూతతో ఒలింపిక్స్‌లో పతకాలై మెరుస్తున్న క్రీడాకారులను కేంద్రం తమ ఖాతాలో వేసుకోవడానికి వెంపర్లాడడం సిగ్గుచేటు. 'భేటీ పడావో..బేటీ బచావో' ప్రచారం వల్లే మహిళా క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారనడం ఈ శతాబ్దంలోనే అతి పెద్ద జోక్‌.
     ఈ దఫా ఒలింపిక్స్‌లో మరో విశేషం. ప్రధాని స్వయంగా క్రీడాకారులతో ఫోన్లో మాట్లాడటం. ప్రోత్సాహం మంచిదే కానీ అది చేతల్లో ఉండాలి మాటల్లో కాదు. వాస్తవానికి ఆటల్లో భావోద్వేగాలు చాలా ప్రభావం చూపిస్తాయి. అందుకనే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులను కూడా దూరంగా ఉంచుతారు. కానీ కేంద్రం పెద్దలు ఈ సోయి కూడా మర్చిపోయి ప్రచార ఆర్భాటాల కోసం తమ పిఆర్‌ వ్యూహాలను ఆటగాళ్లపై రుద్దుతున్నారు. ఆటకు ముందు, తర్వాత స్వయానా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఫోన్‌ చేసి మాట్లాడితే ఎంత ఒత్తిడికి గురౌతారోనన్న ఆలోచన కూడా లేకపోవడం శోచనీయం. క్రీడలను పాఠ్యాంశాలుగా చేయాలని, మార్కులు ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించడం, కుల, మత ప్రాతిపదికలను నివారించి ప్రతిభకు పట్ట కట్టడం వంటివాటిపై ప్రభుత్వాలు శ్రద్ధ పెడితే మట్టిలో మాణిక్యాలు విశ్వవేదికలపై తలుకులీనుతాయి. పతకాలు సాధించాక..వరాల జల్లు కురిపించడంతో పాటు పతకాల దిశగా క్రీడాకారులను తీర్చిదిద్దడంలో పాలకులు శ్రద్ధపెట్టాల్సిన అవసరముంది.