Sep 02,2023 00:53

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి-గుంటూరు : నూతన జాతీయ విద్యావిధానం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతారని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) గుంటూరు జిల్లా ప్లీనరీ సమావేశం శుక్రవారం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా మార్పులు చేస్తూ, పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో మొగలుల చరిత్ర, డార్విన్‌ సిద్ధాంతం, మానవ హక్కులు వంటి అంశాలను తొలగించటం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను షరతుల్లేకుండా అందరికీ అందించాలని కోరారు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు పునరుద్ధరించాలని, విద్యా, వసతి దీవెన పూర్తి స్థాయిలో అందించాలని, జిఒ 77 రద్దు చేసి, పీజీ చదివే విద్యార్థులకు విద్యా, వసతి దీవెన ఇవ్వాలని తదితర సమస్యలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎన్‌.భావన్నారాయణ మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తుందన్నారు. సిలబస్‌లో మార్పులు చేపట్టి విద్యార్థుల్లోకి మనువాద సంస్కృతిని ఎక్కించాలని ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కర్ణాటకలో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు భగత్‌సింగ్‌ పాఠ్యాంశాన్ని తొలగించటం వారి దేశక్తికి నిదర్శమని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌, ఉపాధ్యక్షులు ఎస్‌కె.సమీర్‌, సుభాష్‌, మున్నా, జిల్లా సహాయ కార్యదర్శి పవన్‌, ఈశ్వర్‌, సంతోష్‌, బి.సుచరిత పాల్గొన్నారు.