
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎన్‌ఇపి అమలుతో విద్యార్థుల భవిష్యత్ సర్వ నాశనం అవుతుందని, పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందకుండా చేసే ఎన్‌ఇపికి వ్యతిరేకంగా విద్యార్థులంతా ఉద్యమించాలని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన విద్యార్థి సంగ్రామ సైకిల్‌యాత్ర ముగింపు సందర్భంగా బుధవారం విజయనగరంలో భారీ ప్రదర్శన, సభ నిర్వహించారు. స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు వేలాదిమంది విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించగా, ప్రదర్శనకు ముందు ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల సైకిల్ యాత్ర కొనసాగింది. సైకిల్ యాత్రలో మయూక్ బిశ్వాస్, రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ పాల్గొన్నారు. బాలాజీ జంక్షన్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సభలో మయూక్ బిశ్వాస్ మాట్లాడుతూ నేడు దేశంలో ప్రజలు, విద్యార్థులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ రంగాన్ని ప్రోత్సహించడం వలన విద్య ఖరీదుగా మారిందన్నారు. పేద విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగం లేని ఎన్‌ఇపి దేశంలో మోడీ అమలు చేస్తుంటే దాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తున్నది ఈ రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వమని దుయ్యబట్టారు. రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన ఉచిత విద్యాహక్కును కాలరాస్తున్నాయన్నారు. దేశంలో మతం , కులం పేరుతో వైషమ్యాలను పెంచి దేశ ప్రజలను ఐక్యం కాకుండా విడగొట్టి ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
ప్రభుత్వ విద్యా రంగానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. ఎన్‌ఇపి అమలు చేయడమంటే మన భవిష్యత్ నాశనం చేయడం తప్ప మరొకటి కాదన్నారు.మెడికల్ సీట్లు నేడు డబ్బున్న వాళ్ళకి తప్ప పేదలకు వచ్చే పరిస్థితి లేదన్నారు. విజయనగరంలో చేపట్టిన సైకిల్ యాత్రలో సంక్షేమ హాస్టళ్లలో మరుగుదొడ్లు లేవని గుర్తించామన్నారు. విద్యార్థులకు మరుగుదొడ్లు సౌకర్యం కల్పించని మోడీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా సాధిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా, విద్యా కేంద్రీకరణకు వ్యతిరేకంగా పోరాటాలకు పురిటిగడ్డ విజయనగరం నుంచి నాంది కావాలని పిలుపునిచ్చారు. మన సమస్యలు పరిష్కరించని వారికి 2024 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ మాట్లాడుతూ విద్యలనగరమైన విజయనగరంలో నేడు పేదలకు ప్రభుత్వ విద్య అందని పరిస్థితి నెలకొందన్నారు. విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారానే జిల్లా సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, మెస్ ఛార్జీలు రూ.2500కు పెంచాలని, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, పాఠ్యపుస్తకాలు కాలేజీ విద్యార్దులకు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్ సైకిల్ యాత్ర ద్వారా వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలల్లో తెలుసుకున్న సమస్యలను వివరించారు. సైకిల్ యాత్ర లో గుర్తించిన సమస్యలు పరిష్కారం కోసం భవిష్యత్ లో జరిగే పోరాటంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపనిచ్చారు. సభలో కేంద్ర కమిటీ సభ్యురాలు పావని, జిల్లా నాయకులు పాల్గొన్నారు.











