కడప ప్రతినిధి : ఎట్టకేలకు పులివెందుల-ముద్దనూరు ఎన్‌హెచ్-716 నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రంగం సిద్దమైంది. 2022 ఆగష్టులో జాతీయ రహదారుల ఇంజినీరింగ్ విభాగం నిర్వహించిన టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం టెండర్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల నేప థ్యంలో తాజాగా జాతీయ రహదారుల ఇంజినీరింగ్ విభాగం అధికారులు రూ.1,000 కోట్లతో 56 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల నూతన ప్రతిపాదనలు అందజేశారు. దీనికి కేంద్రప్రభుత్వం నాలుగు వరుసల 716 జాతీయ రహదారి నిర్మాణ పనులకు ఆమోదం తెలిపింది. ఈమేరకు జాతీయ రహదారుల ఇంజినీరింగ్ విభాగానికి టెండర్ల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈమే రకు జిల్లా జాతీయ రహదారుల ఇంజినీరింగ్ యంత్రాంగం 10 రోజుల వ్యవధిలో టెండర్లు నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. 716 జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడితే పులివెందుల నుంచి ముద్దనూరు మీదుగా హిందూపురం వరకు జాతీ య రహదారి పనులు కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్‌హెచ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయభాస్కర్‌రెడ్డిని సంప్రదించగా ఎన్‌హెచ్-716 నెంబర్ గల రహదారి నిర్మాణ పను లకు ఆదేశాలు అందగానే టెండర్లు నిర్వహిస్తామని పేర్కొనడం గమనార్హం.










