
ఎన్‌హెచ్-440 రహదారి నిర్మాణ పనుల్లో కదలిక కనిపించడంలేదు. ఏడాదిన్నర కిందట ఎస్‌ఆర్‌కె కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టు సంస్థ అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి నుంచి కడప జిల్లాలోని వేంపల్లి మండలం గండి వరకు 51 కిలోమీటర్ల మేర రెండు లేన్ల రహదారి నిర్మాణ పనుల కాంట్రాక్టును దక్కించుకుంది. ప్రారంభ దశలో 25 శాతం మేరకు నిర్మాణ పనుల్ని చేపట్టింది. మూడు నెలల అనంతరం జాతీయ రహదారి నిర్మాణ పనుల్ని వదిలేసింది. దీనిపై ఎన్‌హెచ్ ఇంజినీరింగ్ యంత్రాంగం పలుమార్లు ప్రయత్నిం చినప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో టెర్మినేషన్ నోటీసులు జారీ చేసే ప్రయత్నాల్లో నిమగమైనట్లు తెలుస్తోంది.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
ఎన్‌హెచ్-440 రెండు లేన్ల రహదారి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. 2022 మేలో ఎన్‌హెచ్ ఇంజినీరింగ్ యంత్రాంగం నిర్వహించిన రూ.270 కోట్ల టెండరును కర్నాటకకు చెందిన ఎస్‌ఆర్‌కె కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి నుంచి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం గండి క్షేత్రం వరకు 51 కిలోమీటర్ల రెండు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్టు పనుల్ని చేపట్టాల్సి ఉంది. ప్రారంభ సమయంలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండల కేంద్రానికి సమీపంలోని గండి క్షేత్రం నుంచి చక్రాయపేట మండలంలోని సురభి గ్రామం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర రూ.50 కోట్ల విలువ కలిగిన పనుల్ని చేపట్టింది. 25 శాతం పనుల్ని వేగవంతంగా చేపట్టింది. తొమ్మిది నెలల కిందట కాంట్రాక్టర్ మృతి చెందడంతో కాంట్రాక్టు సంస్థ నిర్మాణ పనుల్ని గాలికొదిలేసింది. 2022 మే నుంచి నేటి వరకు సుమారు 17 నెలల వ్యవధిలో 50 శాతం పనుల్ని పూర్తి చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. అంగుళం కూడా కదలని నేపథ్యం విమర్శలకు ఆస్కారాన్ని కలిగించింది. దీనిపై ఎన్‌హెచ్ ఇంజినీరింగ్ యంత్రాంగం పలుమార్లు ఫోన్ ద్వారా కలిసేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. తొమ్మిది నెలలుగా గుత్తేదారు సంస్థ నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. ఎన్‌హెచ్ ఇంజినీరింగ్ యంత్రాంగం టెర్మినేషన్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై గుత్తేదారు స్పందించకపోతే కాంట్రాక్టును రద్దు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గుత్తేదారులో కదలిక వస్తే జాతీయ రహదారి నిర్మాణ పనుల్ని వేగవంతంగా పూర్తి చేయడమా, లేనిపక్షంలో ఉపగుత్తేదారుకు కాంట్రాక్టును అప్పగించి పనులు పూర్తి చేయించడమా అనే ప్రత్యామ్నాయ ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా 2024 మే నాటికి జాతీయ రహదారి పనుల్ని పూర్తి చేయడం సందేహాలకు తావిస్తోంది. దీనిపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయభాస్కర్‌రెడ్డిని సంప్రదించగా టెర్మినేషన్ నోటీసులు జారీ చేసే ఆలోచనల్లో ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. నిర్దేశిత గడువులోపు రాయచోటి-వేంపల్లి జాతీయ రహదారి పనుల్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నామని పేర్కొన్నారు