ప్రజాశక్తి -కరాస: ఎన్‌ఎస్‌టిఎల్‌లో జాతీయ సాంకేతిక దినోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా 9, 10 తేదీలలో ఎన్‌ఎస్‌టిఎల్ ఉత్పత్తుల ప్రదర్శన, మల్టీ మీడియా ప్రజెంటేషన్, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సస్టనేబుల్ ఫ్యూచర్ అనే అంశంపై నమూనాల తయారీ పోటీలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మంగళవారం ఎన్‌ఎస్‌టిఎల్ సంచాలకులు డాక్టర్ వై.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ఓపెన్ హౌస్ ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లను తిలకించి వారు ప్రదర్శించిన వర్కింగ్ మోడల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. వారిని భవిష్యత్తు ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలుగా అభివర్ణించారు. భారత నౌకాదళం కోసం ఎన్‌ఎస్‌టిఎల్ చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకోవడానికి కళాశాల, పాఠశాల విద్యార్థులు ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం పది పాఠశాలలు, 12 కళాశాలల నుంచి మొత్తం 91 నమూనాలు వచ్చాయని, వాటిలో 43 నమూనాలను ప్రదర్శనకు ఎంపికయ్యాయని తెలిపారు. విజేతలకు జాతీయ సాంకేతిక దినోత్సవం నాడు బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పివిఎస్.గణేష్‌కుమార్, కృష్ణకుమార్, ఇతర శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.










