May 11,2023 23:42

అబ్దుల్‌ కలామ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న శాస్త్రవేత్తలు

ప్రజాశక్తి -కరాస: ఎన్‌ఎస్‌టిఎల్‌ మానసి ఆడిటోరియంలో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌టిఎల్‌ సంచాలకులు డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా ప్రొఫెసర్‌ డివిఎల్‌ఎన్‌ సోమయాజులు, విశ్రాంత డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జిఎన్‌.రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్‌ ఎపిజె.అబ్దుల్‌కలాం విగ్రహానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డివిఎన్‌.సోమయాజులు మాట్లాడుతూ, అధునాతన వ్యవస్థల అభివృద్ధిలో గ్లోబల్‌ టెక్నాలజీ జోక్యాల ప్రాముఖ్యత అంశంపై విశ్లేషణ ప్రసంగం చేశారు. డిస్క్రిప్టివ్‌ అండ్‌ గ్లోబల్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనలిటిక్స్‌, డేటా సైన్స్‌, జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వంటి వివిధ అంశాలనూ వివరించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల నిరంతర కృషితో డిఆర్‌డిఒ అభివృద్ధి చేస్తున్న క్షిపణులు, టార్పెడాలలో దాదాపు 95 శాతం భాగాలు స్వదేశీ అని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థల సంయుక్త ప్రమేయంతో పరిశోధన, అభివృద్ధి రంగంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా అవతరించగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పివిఎస్‌.గణేష్‌కుమార్‌, కృష్ణకుమార్‌, ఇతర శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.