వినుకొండ: పట్టణంలోని ఎన్‌ఎస్పి స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన 146 జీవో ను అనుసరించి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు జరపాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే. హనుమంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పుతుంబక వెంకటపతి భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినుకొండ పురపాలక సంఘం ఎన్‌ఎస్పి ఖాళీ స్థలంలో వ్యాపార సముదాయాల నిర్మాణ విధానం సరైంది కాదన్నారు. వ్యాపారాల వద్ద నుండి డబ్బు తీసుకొని ఒక్కొక్క షాపు 12 నుంచి 15 లక్షలు వరకు వేలం పాట ద్వారా కేటాయింపు విధానం చూస్తే సరైనదిగా లేదని, గతంలో ఎన్‌ఎస్పి కాలనీ ముందు భాగంలో దశాబ్దాల నుంచి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు షాపింగ్ ఇస్తామని హామీ ఇచ్చి వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించి నేడు మున్సిపాలిటీ నిర్ణయించిన గుడ్ విల్ కు లక్షలు చెల్లించిన వారికే షాపులు కేటాయింపు ద్వారా చిరు వ్యాపారులకు అన్యాయం జరుగుతుందన్నారు. కాబట్టి ఎన్‌ఎస్పి ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం సరైంది కాదని సిపిఎం భావిస్తుందన్నారు. ఎన్‌ఎస్పి నుండి వినుకొండ మున్సిపాలిటీకి సుమారు 21 ఎకరం బతలాయింపు ద్వారా అప్పగించి ఆ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు వ్యవసాయ శాఖ, వెలుగు, ఎక్సైజ్, లైబ్రరీ, షాదీ ఖానా, అవుట్డోర్ ,ఇండోర్ స్టేడియం పార్క్ తదితర నిర్మాణానికి అనుమతిస్తూ 146 జీవోను విడుదల చేసిందని ప్రస్తుతం వినుకొండ మునిసిపాలిటీ అందరూ భిన్నంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టి ఆ తర్వాత గుడ్ విల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని కోరారు. దీనిపై అఖిలపక్ష పార్టీలతో సమావేశం కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.. సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వరరావు, నాసర్ బి, తిరుమల లక్ష్మి, రంజాన్ బి, ముని వెంకటేశ్వర్లు ఉన్నారు.










