Mar 15,2023 23:11

రక్తదానం చేస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

ప్రజాశక్తి-మధురవాడ : జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ద్వారా యువతలో సేవా భావం పెరుగుతోందని, సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేస్తుందని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవట్టం పేర్కొన్నారు. గీతం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యాన రక్తదాన శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. రక్తం అందించడం ద్వారా అత్యవసర పరిస్థితులలో ఉన్నవారికి ప్రాణాలు నిలుస్తాయన్నారు. ప్రస్తుత అవసరాలను గుర్తించి యువత స్వచ్చంద రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎ.శ్రీనివాస్‌ మాట్లాడుతూ, నగరంలోని వివిధ బ్లడ్‌ బ్యాంక్‌ల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గీతంలో వరుసగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పెద్దఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎస్‌విజి రెడ్డి, ప్రొఫెసర్‌ పివివై. జయశ్రీ, ప్రొఫెసర్‌ తమ్మిరెడ్డి, మదర్‌ రక్త నిధి కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.