ప్రజాశక్తి - రాంబిల్లి : సమస్యలు పరిష్కరించాని కోరుతూ వాడనర్సాపురం వద్ద ఎన్‌ఎఒబి మెయిన్ గేటు వద్ద నేవీ నిర్వాసితులు చేపడుతున్న నిరసన ఆందోళన గురువారం 11వ రోజుకు చేరుకున్నాయి. ఎనిమిది నిర్వాసిత గ్రామాలకు చెంది వేలాదిమంది బైఠాయించి ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జి దేవుడునాయుడు మాట్లాడుతూ, నేవీ నిర్వాసితుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. మూసేసిన నాలుగు గేట్లను తెరవాలని, పెండింగ్ ప్యాకేజీలు చెల్లించాలని, నిర్మాణ పనులలో స్థానికులకు 75శాతం ఉపాధి కల్పించాలని, నిర్వాసిత రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని, కొప్పు గుండుపాలెం నుండి రాజ్యాల అగ్రహారం వరకు రోడ్డు నిర్మించాలని పిడిఎఫ్ నిర్వాసితులైన వారికి పూర్తిస్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేవీ కాలనీలో మౌలిక సదుపాయాలు వెంటనే మెరుగుపరచాలని, చిన్న కలవలపల్లి, కొత్తపేట గోవిందపాలెంచ వాడ్రాంబిల్లి గ్రామాలను పిఐఎఫ్ గ్రామాలుగా గుర్తించి, ప్యాకేజీల అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేవీ మెయిన్ గేట్ నుండి వెంకటాపురం సెంటర్ వరకు కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఆందోళన చేస్తున్న నేవీ నిర్వాసితులో చర్చలకు కలెక్టర్, జిల్లా అధికారులు ఆహ్వనించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లాలని నిర్ణయించారు.










