Nov 12,2022 00:44

చర్చల్లో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, నిర్వాసిత మత్స్యకారులు

ప్రజాశక్తి-అనకాపల్లి
జిల్లాలోని రాంబిల్లి వద్ద గల నావికాదళ ప్రత్యామ్నాయ స్థావరం (ఎన్‌ఎఒబి) నిర్వాసితుల సమస్యలపై శుక్రవారం కలెక్టరేట్‌లో సానుకూలంగా చర్చలు జరిగాయి. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో యలమంచిలి ఎమ్మెల్యే యువి.రమణమూర్తిరాజు, టిడిపి మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, నిర్వాసిత మత్స్యకార నాయకులు, ప్రభావిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో..., 2005 నుండి 2018 వరకు వివిధ సందర్భాల్లో నిర్వాసితులు, జిల్లా అధికారుల మధ్య జరిగిన ఒప్పందాలను నేటికీ అమలు చేయలేదని నిర్వాసితులు తమ గోడును వెళ్లబుచ్చారు.
నిర్వాసితుల డిమాండ్లు
జెట్టీ నిర్మాణమయ్యే వరకు సాంప్రదాయ మత్స్యకారులు వరహా, శారద నదుల్లో వేట చేసుకొనేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు వేటకు వెళ్లేందుకు గేట్లు ద్వారా అనుమతి ఇవ్వాలని, పెండింగ్‌ ఫ్యాకేజీలు ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, ఎన్‌ఎఒబి నిర్వాసిత కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, చిన్న కళవాలపల్లి, కొత్తపట్నం, గోవిందపాలెం, వాడరాంబిల్లి తదితర గ్రామాలను నేవీ ప్రభావిత గ్రామాలుగా గుర్తించి ఫ్యాకేజీ అమలు చేయాలని, బంగారమ్మపాలెం, కొత్త పట్నం, వాడనర్సాపురం, కెజె. పాలెం గ్రామస్తులకు సబ్‌ గేట్లు తెరవాలని, పెండింగ్‌ ప్యాకేజీలు అమలు చేయాలని, శ్మశానాలకు స్థలాలు కేటాయించాలని, స్థానికులకు నిర్మాణ పనుల్లో 75శాతం ఉపాధి కల్పించాలని, ఈ గ్రామాలన్నింటికీ ఆర్‌ కార్డులు మంజూరు చేయాలని, విద్యా, వైద్యానికి సిఎస్‌ఆర్‌ ఫండ్స్‌ కేటాయించాలని, సొసైటీ భూములకు నష్టపరిహారం చెల్లించాలని తదితర డిమాండ్లతో పాటు 25 అంశాలపై చర్చలు జరిగాయి.
పై అంశాలపై జిల్లా కలెక్టర్‌ సానుకూలంగా స్పందిస్తూ నిబంధనలకు లోబడి ఈ సమస్యలను 4 నెలల్లోగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 17 నాటికి ఈ అంశాలన్నింటిపై మినిట్స్‌ రూపంలో తెలియజేస్తామని చెప్పారు. ఈ అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌, మత్స్యశాఖ జెడి, నర్సీపట్నం, అనకాపల్లి ఆర్‌డిఒలతో కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని, అధికారులు, 9 నిర్వాసిత పంచాయతీల మత్స్యకార నాయకులతో మరో సబ్‌ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ, మత్స్యశాఖ జెడి లక్ష్మణరావు, అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ, కొత్తపట్నం, వాడనర్సాపురం, కొత్తపేట, చిన్నకలవలపల్లి, గోవిందపాలెం, బంగారమ్మపాలెం సర్పంచ్‌లు వెంకటేశ్వర్లు, కె.రామారావు, వానపల్లి అరుణలత, శ్రీనివాసరావు, దేముడు, ఎం.శ్రీను, ఎంపిటిసిలు డి.నరసింహులు, సిహెచ్‌.పెంటయ్య, మాజీ సర్పంచ్‌లు సత్యనారాయణ, ఎర్రయ్య, అప్పలరాజు, శ్రీను, నాగేశ్వరరావు, కాసులు, మాజీ ఎంపిటిసిలు రామకృష్ణ, దేముడు, ఎన్‌ఎఒబి కాలనీ నాయకులు ప్రసాద్‌, సిపిఎం మండల కన్వీనర్‌ జి.దేముడు నాయుడు, నాయకులు సిహెచ్‌.గంగరాజు, వాడపాలెం పెద్దలు జి.అప్పారావు, సిహెచ్‌.శివాజీ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని స్పందించాలి : సిపిఎం
అనకాపల్లి : విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎన్‌ఎఒబి నిర్వాసితుల సమస్యలపై స్పందించి, వారి సమస్యల పరిష్కారానికి ప్రకటన చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. దేశానికి రక్షణ కల్పించే నేవీ కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల జీవితాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఎఒబి రాకముందు ప్రశాంతంగా ఉన్న నిర్వాసిత మత్స్యకారుల జీవనం ఇప్పుడు పలు సమస్యలతో అల్లకల్లోలమైందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎఇఒ నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యత, నిర్వాసిత మత్స్యకారుల కోసం జెట్టీ నిర్మాణానికి, వారి సమస్యల పరిష్కారానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రక్షణ రంగానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి డబ్బులు ఖర్చు చేయకుండా వారిని గాలికొదిలేయడం దారుణమన్నారు. వీరి సమస్యల పరిష్కారానికి ప్రధాని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 9 పంచాయతీల మత్స్యకారులు ఇదే ఐక్యతో సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
కొనసాగిన ఆందోళన
రాంబిల్లి : రాంబిల్లి నేవీ మెయిన్‌ గేట్‌ ముందు నిర్వాసిత మత్స్యకారులు చేపట్టిన ఆందోళన నేటికీ 12వ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కూండ్రపు సోమునాయుడు వీరి ఆందోళనకు సంఘీభావం తెలియజేసి మాట్లాడారు. గ్రామాలను తరలించే వరకు ఆధార్‌ కార్డు అనుమతితో చేపలు వేటకు, నిర్మాణ పనులకు అనుమతి ఇస్తామని హామీకి తూట్లు పొడిచి గేట్లు మూసివేయడం, గుంతలు తవ్వడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో రాంబిల్లి మండలంలోని 8 పంచాయతీల నిర్వాసితులు పాల్గొన్నారు.