ప్రజాశక్తి -నక్కపల్లి:ఎన్‌ఏఓబి నిర్వాసిత మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని హెటిరో పైప్ లైన్ వ్యతిరేక పోరాట కమిటీ మత్స్యకార నాయకులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు ప్రకటించారు. హెటిరో పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహా ధర్నా శుక్రవారం నాటికి 340వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అప్పలరాజు, మత్స్యకార నాయకులు, రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో ఎన్‌ఏఓబి నిర్వాశిత మత్య్సకారులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన మహా సంకల్ప పాదయాత్ర సందర్భంగా ఎలమంచిలిలో జరిగిన బహిరంగసభలో అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వమే నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నేటికీ ప్యాకేజీ ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ నెల 11,12 తేదీలలో విశాఖపట్నం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ప్యాకేజీ, ఇతర సమస్యలపై తెలియజేయాలని కోరారు. ఎన్‌ఏఓబి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం పరిధిలోదని రాష్ట్ర ప్రభుత్వం తప్పించు కోవాలని చూస్తుందన్నారు. అభివృద్ధి పేరు చెప్పి సముద్ర తీరంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు మత్య్సకారుల ఉపాధిని దెబ్బ తీస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.రాజేష్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి వాసుపల్లి నూకరాజు, గోసల స్వామి, మైలపల్లి జాన్, చేపల సోమేష్, మైలపల్లి బాపూజీ, పిక్కి రాజు, బొంది నూకరాజు, చొక్కా గోపి తదితరులు పాల్గొన్నారు.










