ప్రజాశక్తి-రాంబిల్లి
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్‌ఎఒబి నిర్వాసితులు 80 రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బుధవారం అనకాపల్లి ఆర్డీవో చిన్ని కృష్ణ, రాంబిల్లి తహశీల్దారు భాగ్యవతి, ఇతర అధికారులు సర్వే నిర్వహించారు. నిర్వాసిత గ్రామాలైన చిన్న కలవలపల్లి, కొత్తపేట, గోవిందపాలెం, వాడపాలెం గ్రామాలలో సర్వే చేశారు. నేవీ ప్రాజెక్టు రావడం వలన తమకు జరిగిన అన్యాయంపై నాలుగు గ్రామాల నిర్వాసిత పెద్దలు సమస్యలతో కూడిన వినత పత్రాన్ని అధికారులకు అందించారు. పిఎఎఫ్ గ్రామాలైన కొత్తపట్నం, వాడ నరసాపురం, కేజీ.పాలెం, పిడిఎఫ్ గ్రామాలైన నేవీ కాలనీ గ్రామాల పెద్దలు వారి సమస్యలను వినతిపత్రం రూపంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు ద్వారా జిల్లా అధికారులకు అందించారు. బోట్లకు రూ.6 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, జీవన భృతి కుటుంబ పెద్దతో పాటు మేజర్ కుమారులకు అందించాలని డిమాండ్ చేశారు.
కొనసాగిన 50వ రోజు ఆందోళన
నేవీ మెయిన్ గేటు ముందు నిర్వాసిత ఎనిమిది గ్రామాల ప్రజలు నిర్వహిస్తున్న ఆందోళన బుధవారం నాటికి 80వ రోజుకు చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని నేవీ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. శారద, వరాహ నదుల్లో వేటకు వెళ్లి తమ జీవనాన్ని కొనసాగించే వాళ్లమని, ఇప్పుడు నేవీ వాళ్లు గేట్లు మూసివేయడంతో తమ చేపల వేట సాగక ఉపాధి లేకుండా పోయిందని తెలిపారు. తక్షణమే జెట్టీ నిర్మాణం చేయాలని, అంత వరకు ఆధార్ కార్డు ఆధారంగా వేటకు వెళ్లే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.










