Aug 30,2023 00:22

నినాదాలు చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి-రాంబిల్లి
మండలంలో ఎన్‌ఎఒబిలో రోజుకు 12 గంటల పాటు కార్మికుల చేత పని చేయించుకొని వారికి కనీస వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని, తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. స్థానిక తుఫాన్‌ బిల్డింగ్‌ వద్ద మంగళవారం జరిగిన సిఐటియు మండల సమన్వయ కమిటీ సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడుతూ కనీస వేతనాలు, సౌకర్యాలు అడిగితే తొలగించడం అన్యాయమన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వివోఏలు వీఆర్‌ఏల చేత ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు, జి.దేముడునాయుడు, ఎన్‌ఎఒబి నిర్మాణ కార్మికులు, ఆటో, ముఠా, బిల్డింగ్‌, పంచాయతీ కార్మికులు, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం, వివోఏ, లారీ డ్రైవర్స్‌ పాల్గొన్నారు.