
ప్రజాశక్తి -మధురవాడ, విశాఖ కలెక్టరేట్ : గీతం వ్యవస్థాపకులు డాక్టర్ ఎంవివిఎస్.మూర్తి ఐదవ వర్థంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గీతం సమీపంలోని ఆయన స్మృతివనం వద్ద కుటుంబీకులు, గీతం సిబ్బంది నివాళులర్పించారు. ఈ సందర్భంగా గీతం అధ్యక్షులు ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ, గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం) విద్యాలయాన్ని స్థాపించడానికి ఎంవివిఎస్.మూర్తికి మహత్మాగాంధీ స్ఫూర్తి అని చెప్పారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి పారిశ్రామిక, రాజకీయ, విద్యారంగాలలో మూర్తి తనదైన ముద్ర వేశారన్నారు. జీవితంలో విజయాలను, అపజయాలను సమంగా స్వీకరించడం, అంకితభావం, కష్టపడే తత్వం ఆయన నుంచి నేర్చుకోవలసిన విషయాలన్నారు. ఎంతటి కష్టమైనా గాంధీ మార్గంలో మూర్తి సాగించిన ప్రయాణాన్ని గీతం కొనసాగిస్తోందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎమ్.గంగాధరరావు, గీతం కార్యదర్శి ఎమ్.భరద్వాజ్, డాక్టర్ ఎంవివిఎస్.మూర్తి చిన్న కుమారుడు ఎమ్.లక్ష్మణరావు, గీతం ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.గౌతమరావు, జిమ్సర్ ప్రో-వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.గీతాంజలి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరణ్, మూర్తి కుటుంబ సభ్యులు, వివిధ కళాశాలల డీన్లు, ప్రిన్సిపల్స్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
దక్షిణంలో వైద్య శిబిరం
విశాఖ కలెక్టరేట్ : గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ ఎంవివిఎస్.మూర్తి వర్థంతిని పురస్కరించుకొని దక్షిణ నియోజకవర్గంలోని 39వ వార్డులో గీతం సంస్థల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి విశాఖ పార్లమెంట్ ఇన్‌ఛార్జి ఎం.శ్రీ భరత్, దక్షిణ నియోజకవర్గం ఇన్‌ఛార్జి గండి బాబ్జీ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ 39వ వార్డు అధ్యక్షుడు వాసుపల్లి దానేశ్, అబ్దుల్ గఫూర్ (లడ్డు), వార్డు మహిళా విభాగం కార్యదర్శి పి.కనక మహాలక్ష్మి, అబ్దుల్ రెహమాన్, వార్డు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రేమ సమాజంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.