Jun 29,2023 00:03

మాట్లాడుతున్న డొక్కా మాణిక్యవరప్రసాద్‌

ప్రజాశక్తి - మాచర్ల : పట్టణంలోని మాచర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎంతో చరిత్ర కలిగిన విద్యా సంస్థ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో బుధవారం ఉదయం పూర్వ విద్యార్ధుల సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత భవిష్యత్‌ కల్పించిన విద్యా సంస్థ ఎస్‌కెబిఆర్‌ ప్రభుత్వ కాలేజి అని చెప్పారు. మాచర్ల ప్రభుత్వ కాలేజికి పిడుగురాళ్ల, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తదితర దూర ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చేవారని తెలిపారు. 1970ల నుండి ఇక్కడ ఉన్నత విద్య అందుబాటులో ఉందని అన్నారు. ఈ కాలేజీ అభివృద్ధికి ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయ, సహకారాలను అందించాలని కోరారు. చాలా కాలం తర్వాత ఎంతో మంది మిత్రులు కలుసుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ లక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయశాఖ సలహ మండలి చైర్మన్‌ కుర్రి సాయిమార్కోండారెడ్డి, డాక్టరు సుబ్బారావు, రిటైర్డు డిప్యూటి డిఇఒ రామక్రిష్ణ పాల్గొన్నారు.