Oct 05,2023 21:17

పూసపాటిరేగ : వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, డిఎంహెచ్‌ఒ భాస్కరరావు

ప్రజాశక్తి-పూసపాటిరేగ, డెంకాడ :  జగనన్న ఆరోగ్య సురక్ష కాంప్‌లకు వచ్చిన ప్రజలందరికి ఎంత సమయమైనా తప్పకుండా తనిఖీలు చేసే పంపాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ పూసపాటిరేగ మండలం గుంపాం, డెంకాడ మండలం బొడ్డవలస గ్రామాల్లో ఏర్పాటు చేసిన సురక్ష శిబిరాలను తనిఖీ చేశారు. గుంపాంలో 364 మంది నమోదు చేసుకున్నారు. శిబిరం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌, ఓపి రిజిష్ట్రేషన్‌, స్పాట్‌ రిజిష్ట్రేషన్‌, ఐటి రూమ్‌, వైద్యుల కేటాయింపు, ల్యాబ్‌, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ సహాయ కేంద్రం, వైద్యుల గదులు, మందులిచ్చే కౌంటర్‌, న్యూట్రిషన్‌ స్టాల్‌, కంటి పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ సందర్శించారు. రోగులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. కళ్లద్దాలను పంపిణీ చేశారు. వైద్యులతో మాట్లాడుతూ ఏడు రకాల పరీక్షలను నిర్వహించి, హెల్త్‌ ప్రొఫైల్‌లో వారి వివరాలను నమోదు చేయాలని, అవసరమైన వారికి కేస్‌ షీట్లను అందించాలని తెలిపారు. శిబిరాల్లో ఇసిజితో సహా మొత్తం 14 రకాల పరీక్షలను నిర్వహించి, 105 రకాల మందులను ఉచితంగా ఇవ్వాలని తెలిపారు. కంటి పరీక్షలను కూడా నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలను కూడా అందజేసారు. బొడ్డవలస శిబిరంలో 300 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ భాస్కరరావు, ఐసిడిఎస్‌ పీడీ శాంత కుమారి, పూసపాటిరేగ ఎంపిడిఒ రాధిక, తహశీల్దార్‌ భాస్కర రావు, ఎంపిపి కల్యాణి, వైద్యులు, స్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. డెంకాడ మండల తహశీల్దార్‌ ఆదిలక్ష్మి, ఎంపిడిఒ స్వరూప రాణి, ఎంపిపి బంటుపల్లి వాసుదేవ రావు తదితరులు పాల్గొన్నారు.