ఎంసీఏ, ఎంబీఏ కోర్సులలో ఏది బెటర్ ..? ఆర్‌సిఆర్ బిజినెస్ స్కూల్ కాలేజీ డైరెక్టర్ విశ్లేషణ
ఎంసీఏ, ఎంబీఏ కోర్సులలో ఏది బెటర్ ..?
ఆర్‌సిఆర్ బిజినెస్ స్కూల్ కాలేజీ డైరెక్టర్ విశ్లేషణ
ప్రజాశక్తి - క్యాంపస్
- రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న ఎంతోమంది విద్యార్థులు ఏ కోర్స్ వైపు ఉన్నత అవకాశాలు ఉన్నాయనే అంశంపై పూర్తిస్థాయి అవగాహన రాహిత్యంతో తికమక పడుతూ ఉంటారని ఆర్ సి ఆర్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ వి.రవికుమార్ చౌదరి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రొఫెషనల్ కోర్సులలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సులలో ఏది బెటర్ అనే అంశంపై రవికుమార్ చౌదరి ''ప్రజాశక్తి ''తో మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో ఉన్నత ఆశయంతో డిగ్రీని పూర్తిచేసుకుని ఏ కోర్సులో చేరితే ఉన్నత అవకాశాలు ఉంటాయని సందిగ్ధంలో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఐసెట్ ద్వారా ఎంబీఏ లేదా ఎంసీఏ లలో ప్రవేశం పొందచ్చని వెల్లడించారు. ఇప్పటికే చాలామంది ఎంబీఏ, ఎంసీఏ లలో ఏ కోర్సులో చేరాలో తెలియక తికమక పడుతూ ఊగిసలాడే ధోరణిలో ఉన్నారని అన్నారు. ఈ కోర్సులలో ఏ కోర్సులో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎవరికి ఏ కోర్సు సరిపోతుంది, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఐసెట్ 2 విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల స్వరూపం అవకాశాలు భవిష్యత్తు తదితర అంశాలపై ఆయన ''ప్రజాశక్తి ''తో ప్రత్యేక కథనంలో వెల్లడించారు.
కోర్సుల ఎంపిక ఎలా ....?
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) అనేవి ఉన్నత విద్యపరంగా విద్యార్థులకు అందుబాటులో ఉన్న రెండు ప్రముఖమైన ప్రొఫెషనల్ కోర్సులు. ఈ రెండు కోర్సులు కార్పొరేట్ రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించేవి. ఏది మంచి కోర్సు, ఎందుకు మంచిది, అనేది నిపుణులు కూడా స్పష్టంగా సమాధానం చెప్పలేని ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ రెండు కోర్సులలో ఒకదానికొకటి విభిన్నమైనవి. ఒకరు అడ్మినిస్ట్రేషన్ రంగంలో మాస్టర్స్, ఇంకొకరు కంప్యూటర్ అప్లికేషన్లు రంగంలో దిట్ట. కావున ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో దేనికి ఓటేయాలో నిర్ణయించుకోవాల్సింది విద్యార్థులే.
డిగ్రీలో ఏ సబ్జెక్టు తీసుకున్న ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. అదే ఎంసీఏ కోర్సులో చేరాలంటే ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ ఒక ప్రత్యేకమైన సబ్జెక్టుగా చదివి ఉండాలి. రెండు కోర్సులలో ఏ కోర్సు చేసిన రాణించగలము అనే నమ్మకం, విద్యార్థులకు ఉన్నవాళ్లు ఆ కోర్స్ ఎంపిక, ఎంపిక చేసుకున్న కాలేజీ, ఉద్యోగం స్వభావం, కంపెనీలు, వివిధ స్కిల్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నైపుణ్యాలు, స్వీయ లక్ష్యం ఆధారంగా దీని వైపు మొగ్గు చూపాలో నిర్ణయించువచ్చు.
ఎంబిఎ యువతను ఆకర్షిస్తున్న క్రేజీ కోర్సులలో ముందుంది. కంపెనీల నిర్వహణకు అవసరమైన మానవ వనరులను అందించడం ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. కార్పొరేట్ రంగంలో కీలక బాధ్యతలు నిర్వహణ చూస్తున్న బిజినెస్ మేనేజర్లు, సీఈవోలు ఎక్కువ మంది ఎంబీఏ కోర్సు చేసిన వాళ్లే. కార్పొరేట్ కెరియర్ సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎంబీఏ కోర్సు చేరడం ఎంతో ఉత్తమం. మేనేజ్మెంట్ రంగంపై ఆసక్తితో పాటు నాయకత్వ లక్షణాలు కలిగిన గ్రాడ్యుయేట్లు ఎంబీఏ కోర్సులో చేరడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇంటర్ పర్సనల్ స్కిల్స్, టీం మేనేజ్మెంట్ నైపుణ్యాలు, బిజినెస్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఎంబీఏ చక్కగా సరితూగుతుందని అన్నారు. దీనికి తోడు కమ్యూనికేషన్ స్కిల్స్, బందంగా పనిచేసే నేర్పు, పని నిర్వహణ సామర్థ్యం, ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయగలగడం, బంద పనితీరు మెరుగుపరిచేలా మోటివేషన్ చేయడం, సమన్వయంతో వ్యవహరించడం, సమస్య వచ్చినప్పుడు కారణాలు అన్వేషించడం వంటి నైపుణ్యాలవారు ఎంబీఏ కోర్సును ఎంచుకోవచ్చు అన్నారు.
ఎంసీఏ కోర్సు ఇంజనీరింగ్ కు దీటైన కోర్సుగా పేరుంది. ఇది కంప్యూటర్స్ ఐటీ రంగానికి సంబంధించిన ఉన్నత విద్యా కోర్సు కంప్యూటర్స్ పై ఆసక్తి ఉండి రోజురోజుకు విస్తరిస్తున్న ఐటీ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటే ఎంసీఏ కోర్సులు ఎంచుకోవచ్చు అని రవికుమార్ వెల్లడించారు. గణిత శాస్త్రం పై పట్టు, ప్రాక్టికల్స్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ నైపుణ్యాలు ఉన్నవారు ఎంసీఏ కోర్సును ఎన్నుకోవడం వలన ఎన్నో మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చన్నారు. ఎంసీఏ విద్యార్థులకు ప్రధానంగా ఉపాధిని కల్పించే రంగం సాఫ్ట్వేర్ రంగం. ఈ రంగంలో టెక్నాలజీతో పాటు పూర్తి కాలం పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెక్నాలజీని పరంగా వస్తున్న కొత్త ఆవిష్కరణలు, కంప్యూటర్ లాంగ్వేజెస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అవుతూ కొత్త కోర్సులపై పట్టు సాధించాలని సూచించారు. ఏదైనా విషయాన్ని వేగంగా అవగాహన చేసుకుని నేర్పు విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయగలిగిన పట్టుదల కలిగిన వారే ఎంసీఏ కోర్సులు ఎంచుకోవాలన్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, బంద నిర్వహణ, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇంట్రడక్షన్లు కూడా కీలకంగా నిలుస్తున్నాయన్నారు. విద్యార్థులు ఆయా అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
ఎంబీఏ కోర్సుతో కొలువులు
మార్కెటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, రిటైల్ మేనేజ్మెంట్ వంటి విభాగాలలో ఎంబీఏ అభ్యర్థులకు కొలువులు సులభంగా లభిస్తాయి. ముఖ్యంగా ఎంచుకున్న స్పెషలైజేషన్ బట్టి ఉద్యోగాలు ఇక్కడ ఉంటాయి. మేనేజర్లుగా, ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్, టీం లీడింగ్ ఇతర విభాగాల్లో సమన్వయం వంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. రిటైల్ ఇండిస్టీ, కన్సల్టెంట్ సంస్థలు, హోటల్ ఇండిస్టీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సంస్థలు, మీడియా రంగం, డిజిటల్ మార్కెటింగ్, ఎడ్యుకేషన్ రంగం తదితర రంగాలలో చేరి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
ఎంసీఏ కోర్స్ తో అవకాశాలు
ఈ కోర్సుతో సాఫ్ట్వేర్ రంగంలో చక్కటి అవకాశాలు దక్కించుకోవచ్చు. ఎంసీఏ పూర్తి చేసుకున్న వారికి ఇటీవల కాలంలో ఐటీ రంగంలో అవకాశాలు మెరుగవుతున్నాయి. వెబ్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఐటి అడ్మినిస్ట్రేటర్ వంటి అనేక అంశాల్లో వారిగా అనేక కొలువులు పొందేందుకు అవకాశం ఉంది. నైపుణ్యాలు ఉంటే ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్థలు, బహుళ జాతి కంపెనీలు, ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు, టెలికాం కంపెనీలు అనేక విధాలుగా అవకాశాలను ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.










