Jul 18,2023 09:42

విలేకరులతో మాట్లాడుతున్న టిడిపి నాయకులు

         రొళ్ల : మడకశిర శాసనసభ్యుడు తిప్పేస్వామిపై ఆయన పార్టీకే చెందిన రొళ్ల మహిళా ఎంపిపి కవిత చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని మండల టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలకు హద్దులు లేకుండా రెచ్చిపోతున్నారని, ప్రతి అంశంలోనూ కమిషన్‌ లేనిదే ఏ పనీ చేయరంటూ వైసీపీకే చెందిన ఎంపిపి మీడియా ముందు చెప్పారన్నారు. ఎమ్మెల్యే వల్ల ఆమో కుటుంబానికీ ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఒక మహిళా ప్రజాప్రతినిధి ఇంతలా ఆరోపణలు చేశారంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. నిత్యం ప్రతిపక్షాలపై గొంతుచించుకునే ఎమ్మెల్యే అనుచరులు వైసీపీ ఎంపీపీ చేసిన ఆరోపణలకు ఏమి సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసిపి నేతలు వాస్తవాలను తెలుసుకుని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు యన్‌.దాసిరెడ్డి, టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి బియస్‌.గురుమూర్తి, జికె.ఈరన్న, భరత్‌, రామకృష్ణ, బాలకష్ణ, నాగరాజు, మాజీ ఎంపిపి కిష్టప్ప, సిద్దగంగప్ప, వెంకటేష్‌, రమేష్‌ పాల్గొన్నారు.