ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: బోయ/వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని అమలు చేయాలని రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రస్తావించడంపై శుక్రవారం ఎపి ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం జంక్షన్ వరకు సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసి గిరిజనులకు వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేస్తుందన్నారు. జీవన విధానంలో భిన్నంగా ఉన్న బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రస్తావన చేయడం దుర్మార్గమన్నారు. వీరిని ఎస్టీ జాబితాలో చేర్చితే ఆదివాసిల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. ఆదివాసుల హక్కులు, చట్టాలు కాలరాస్తూ అనర్హులైన బోయా/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాథ్ మాట్లాడుతూ, బోయా/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రయత్నాలు మానుకోవాలని, లేని పక్షంలో నిరసనలు, రాస్తారోకోలు, ముట్టడులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు గాసిరాం దొర, నర్సింగ్ పడాల్, రామదాసు, బలరాం, సిపిఎం మండల కార్యదర్శి భీమరాజు పాల్గొన్నారు.
ఎస్టి జాబితాలో చేర్పిస్తే సహించం
డుంబ్రిగుడ:బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించడాన్ని నిరసిస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని అరకు సంత బయలు వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.చిన్నస్వామి మాట్లాడుతూ, ఆర్థికంతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన బోయ/వాల్మీకులను ఎస్టి జాబిలో చేర్పిస్తే గిరిజనులు తీవ్రంగా నష్టపోతారన్నారు. దీనిపై గిరిజన ఎమ్మెల్యేలు పాల్గుణ, భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రవిబాబు, ఎంపీ మాధవి తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన జాతికి ద్రోహం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కనీసం నోరు మెదపకపోవడం సరికాదన్నారు. తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేసి గిరిజనులతో కలిసి పోరాటం సాగించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టి మండల అధ్యక్షుడు డి.మోహన్ రావు, ఉపాధ్యక్షుడు పి.గంగాధర్, సీనియర్ నాయకులు పి వెంకటబాబు కొండప్ప, స్వాభి, గేన్ను పాల్గొన్నారు.










