Nov 05,2023 00:28

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఎంపీ లాడ్స్‌ నిధుల క్రింద మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల ఇంజినీరింగ్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి వివిధ శాఖల ఇంజినీరింగ్‌ అధికారులతో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్‌ ఎంపీ లాడ్స్‌ పరిధిలో 2019 -20 , 2021-22, 2022-23 , 2023 -24 సంవత్సరాలకు గాను రూ.1957.78 లక్షల వ్యయంతో 230 పనులు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో వివిధ శాఖలకు కేటాయించిన పనులలో 65 పూర్తి అయ్యాయని, 26 పనులు పురోగతిలో వున్నాయని , 139 పనులు ప్రారంభించాల్సి వుందని తెలిపారు. పురోగతిలో ఉన్న పనులు ఎప్పుటిలోగా పూర్తి చేస్తారు, ఇంకా పనులు మొదలు పెట్టని వాటిని ఎప్పుడు మొదలు పెడతారో తేదీల వారీగా వివరాలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. పనులు పూర్తి అయిన వాటికి సంబంధించి బిల్లులు ఈనెల 20వ తేదీ నాటికి సిపిఓకి అందించాలన్నారు. బిల్లులు చెల్లించిన వాటికి సంబంధించి ఈసీ లు సంబంధిత శాఖల అధికారులకు అందించాలన్నారు. రాజ్య సభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ఎంపీ లాడ్స్‌ పరిధిలో 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు గాను రూ. 982.76 లక్ష్యల వ్యయంతో మంజూరు అయిన 54 పనులలో 31 పనులు పూర్తి అయ్యాయని , 6 పనులు ప్రోగ్రెస్‌ లో వున్నాయని 17 పనులు ప్రారంభించాల్సి వుందన్నారు. అదే విధంగా బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్‌ , మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి, రాజ్యసభ్యులు మోపిదేవి వెంకట రమణ మంజూరు చేసిన ఎంపీ లాడ్స్‌ నిధుల ద్వారా కేటాయించిన నిధులను జిల్లా అభివద్దికి వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఓ శేషశ్రీ , జిఎంసి ఎస్‌ఈ పివికే. భాస్కర్‌ , యంటీయంసీ ఎస్‌.ఈఏ. శ్రీనివాస రెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌.ఈ ఉమామహేశ్వరావు, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ ఎం.శ్యామ్‌ సుందర్‌, పిఐయు ఈఈ రమేష్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్య సురక్షపై నిరంతర పర్యవేక్షణ
జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించడంతో పాటు నెట్‌వర్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేసిన రోగులకు వైద్య చికిత్సలు అందించేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్‌ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కే. ఎస్‌. జవహర్‌ రెడ్డికి తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైద్యం ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం , సుస్థిర అభివద్ది లక్ష్యాలు , ఆరోగ్యశ్రీ , వైయస్సార్‌ సంపూర్ణ పోషణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గుంటూరు కలెక్టరేట్‌ నుండి సంయుక్త కలెక్టర్‌ జి రాజకుమారి, డిఆర్‌ఓ కే. చంద్ర శేఖర రావు, డియం అండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ బాబు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.