ప్రజాశక్తి-కాకినాడ ఎంఒయులతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జెఎన్టియుకె విసి జివిఆర్.ప్రసాదరాజు అన్నారు. వర్శిటీ ప్రాంగణంలో శుక్రవారం విసి కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ఆధ్వర్యంలో కోట పట్టణంలోని పాల్కన్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూఢిల్లీలోని అయోటెక్ వరల్డ్ యావిగేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ కఓసం జెఎన్టియుకె ఎంఒయు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా విసి ప్రసాదరాజు మాట్లాడుతూ ఈ ఒప్పందంలో భాగంగా విద్యార్థులకు డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో శిక్షణ ఇచ్చి డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారి ద్వారా సర్టిఫికెట్ వచ్చే విధంగా తర్ఫీదు ఇస్తామన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా విద్యార్థులకు 10 కోర్సులలో శిక్షణ అందిస్తారని, ఈ శిక్షణ ద్వారా వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం, రెవెన్యూ, విమానయాన రంగాలకు సంబంధించిన డ్రోన్లను వినియోగించేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రక్షణ రంగం, త్రీడి మోడలింగ్, భవన నిర్మాణం, రోడ్డు రవాణా, లాజిస్టిక్, పరిశ్రమలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని విసి వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, యుసిఇకె ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు పాల్గొన్నారు.










