Aug 19,2023 22:16

ఎంఇఒపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌

      కదిరి టౌన్‌ : 'ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను పిల్లలు అనుకుంటున్నావా... లేక పశువుల్లాగా భావిస్తున్నావా..' అంటూ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండల విద్యాధికారి చెన్నకృష్ణపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన కదిరి పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. వీవర్స్‌ కాలనీలోని ప్రభుత్వ మున్సిపల్‌ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇరుకు గదుల్లో పాఠశాల నిర్వహణ, ఆవరణంలో అపరిశుభ్రత, మెనూ ప్రకారం భోజనం ఇవ్వలేదనే తదితర సమస్యలను ఆయన గుర్తించారు. ఈ సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యారంటూ కదిరి ఎంఇఒ చెన్నకృష్ణపై తీవ్ర స్థాయిలో ఆగ్రంవ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. సకాలంలో ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలని సూచించారు.
సమస్యలపై వినతులు
కదిరి విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌కు పలు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమస్యలపై వినతులు అందజేశారు. నాడు-నేడులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని, 3,4,5 తరగతుల విలీనాన్ని విరమించుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి, ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలిని ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు శ్రీధర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు.