Apr 06,2023 01:13
డీఈవోకు వినతిపత్రం అందిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల జిల్లా బల్లికురవ మండల విద్యాశాఖాధికారి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారి పివిజే రామారావుకు యుటిఎఫ్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. బల్లికురవ ఎంఈఓ వీరాఘవయ్యపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని యుటిఎఫ్‌ బాపట్ల కమిటీ కోరింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2022 నవంబరు ఎంఈవోపై విచారణ చేసి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉపాధ్యాయులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆర్థికపరమైన ఆరోపణలు, నిధుల దుర్వినియోగం, ఉపాధ్యాయులను కించపరుస్తూ ఏకవచనంతో సంబోధిస్తూ నన్నెవరూ ఏమీ చేయలేరని అహంకార పూరితంగా మాట్లాడుతున్నారన్నారు. గతంలో డిడిఓ ఖాతాలో అక్రమంగా నగదు డ్రా చేశారని తెలియజేసినా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేదన్నారు. ఎంఈఓపై చర్యలు తీసుకోకపోతే వారం రోజుల్లో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు డీఈవో ఒక వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు బాపట్ల జిల్లా అధ్యక్షులు వినరు కుమార్‌, కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి, రవిబాబు, రామాంజనేయులు, బాపయ్య, రాజేష్‌ పాల్గొన్నారు.