Sep 29,2023 21:46

స్వామినాథన్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

కడప అర్బన్‌ : ఎం.ఎస్‌. స్వామినాథన్‌ మృతి రైతాంగానికి తీరని లోటని ఎపి రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు జి. చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.దస్తగిరి రెడ్డి అధ్యక్షతన ఎం.ఎస్‌. స్వామినాథన్‌ సంతాప సభ శుక్రవారం నిర్వహించారు. ముం దుగా ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం కడప జిల్లా గౌరవాధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ ఇక లేరన్న విషయం అందరినీ కలిచివేసే అంశం అన్నారు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్‌ చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారని తెలిపారు. 1925 ఆగష్టు 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభ కోణం ప్రాంతంలో జన్మించారని తెలిపారు. ఆహార వద్ధిలో భారత్‌ స్వయం సమద్ధి సాధించేందుకు విశేష కృషి చేశారని తెలిపారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివద్ధి చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇది భారతదేశంలోని తక్కువ ఆదాయ గల రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయ పడిందన్నారు. స్వామినాథన్‌ 1987లో చెన్నైలో ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను స్థాపించారని చెప్పారు. దాని ద్వారా ఆయన మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారని తెలిపారు. 1971లో రామన్‌ మెగసెసే అవార్డు, 1986లో ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వరల్డ్‌ సైన్స్‌ అవార్డు అందుకున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి స్వామినాథన్‌ అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. ప్రతి రైతు సంక్షేమంలోనూ స్వామినాథన్‌ జీవించి ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌, ఏ.పీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకష్ణయ్య, సిపిఎం నగర కార్యదర్శి ఏ.రామ్మోహన్‌ డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఓబులేసు, వామపక్ష రైతు సంఘాల నాయకులు మనోహర్‌ రెడ్డి, బాలచంద్రయ్య, శేఖర్‌ సిఐటియు నాయకులు చంద్రారెడ్డి, విద్యార్థి సంఘం నాయకుడు ఎం.ఆర్‌.నాయక్‌ పాల్గొన్నారు.