Jul 28,2021 20:59

అరకొర ప్యాకేజీపై పార్లమెంటరీ ప్యానెల్‌ అసంతృప్తి
న్యూఢిల్లీ :
కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ 'తగినంతగా' లేదని పార్లమెంటరీ ప్యానెల్‌ తన నివేదికలో పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)లపై కోవిడ్‌ ప్రభావం గురించి పరిశ్రమలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక ఇచ్చింది. కోవిడ్‌ మొదటి వేవ్‌ తర్వాత ఆర్థికంగా పునరుద్ధరణ జరిగే క్రమంలో సెకండ్‌ వేవ్‌తో పరిస్థితి మరీ దిగజారిందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో అండగా నిలువాల్సిన ప్రభుత్వం కేవలం రుణ మంజూరుకు మాత్రమే చర్యలు తీసుకుంది కానీ, తక్షణమే సాయమందించేలా, డిమాండ్‌ను పెంచేందుకు నగదు సరఫరాను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. డిమాండ్‌ను, పెట్టుబడులను, ఎగుమతులను, ఉపాధి కల్పనను పెంచేలా, తద్వారా ఆర్థిక వ్యవస్థకు దోహదపడేలా విస్తృతమైన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ఆ నివేదిక సిఫార్సు చేసింది. వాస్తవంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి జరిగిన నష్టాలపై కూలంకషమైన అధ్యయనం అవసరమని పేర్కొంది. అప్పుడే ఈ పరిశ్రమ పునరుద్ధరణకు సమర్ధవంతమైన ప్రణాళికను రూపొందించగలుగుతారని పేర్కొంది.