Oct 01,2023 23:59

ఎంఎస్‌ స్వామినాథన్‌కు ఘన నివాళి

ఎంఎస్‌ స్వామినాథన్‌కు ఘన నివాళి
ప్రజాశక్తి- రేణిగుంట: హరిత విప్లవ పితా మహుడు, భారతదేశ అన్నదాత, వ్యవసాయ శాస్త్రవేత్త పద్మవిభూషణ్‌ డాక్టర్‌ ఎం ఎస్‌ స్వామినాథన్‌ కు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న గిరిజన రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంతాప సభలో జనవిజ్ఞాన వేదిక తిరుపతి జిల్లా కార్యదర్శి సి రెడ్డప్ప మాట్లాడుతూ '' కరువుకాటకాలతో, ఆహారం లేక ఆకలితో లక్షలాది మంది ప్రజలు మరణించడంతో స్పందించిన 18 ఏండ్ల స్వామినాథన్‌ డాక్టర్‌ చదువు వదలి అగ్రికల్చర్‌ చదువు కోవడం, అహర్నిశలు పరిశోధనలతో ఆకలి దేశాన్ని అందరికి ఆహారధాన్యాలు అందించి ఇతర దేశాలకు ఎగుమతి చేసేవిధంగా చేయడం అసలైన దేశభక్తి అన్నారు. ఓ వెంకట రమణ మాట్లాడుతూ ఆహారధాన్యాల అధికోత్పత్తి సాధించిన స్వామినాథన్‌ రైతు భాందవుడయ్యారన్నారు. రైతుకు కనీసమద్దతు ధర ప్రభుత్వమే ఇవ్వాలని, ఆధునిక వ్యవసాయ సాంకేతికతను, పరికరాలను రైతుకు ఇవ్వాలనీ, అనేక శాస్త్రీయ సిఫార్సులు చేశారన్నారు. ఈ నివాళి సభకు పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ హరిబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పురుషోత్తం, జనవిజ్ఞాన వేదిక మండల నాయకులు కుప్పస్వామి పీఇటీ, తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్లు ఎం ఎస్‌ స్వామినాథన్‌ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.