Mar 02,2023 22:46

స్థానిక ప్రతినిధుల్లో అసంతృప్తులపై వైసిపి అధిష్టానం అప్రమత్తం
నియోజకవర్గం, డివిజన్లవారీ క్యాంపుల నిర్వహణకు సమాయత్తం
టిడిపి వ్యూహాలతో అధికారపక్ష ఎంఎల్‌ఎలకు ముచ్చెమటలు
ప్రజాశక్తి - పశ్చిమ డెస్క్‌

'స్థానిక సంస్థల్లో మూడింట రెండొంతులకుపైగా మనవాళ్లే ఉన్నారు.. ఇక ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ పడే సాహసం ఎవరు చేస్తారులే అని అధికారపక్షం భావించింది. స్వతంత్ర అభ్యర్థులను సైతం సామ, దాన, బేధ, దండోపాయాలు ప్రయోగించి పోటీ నుంచి తప్పించొచ్చని తలచింది. అయితే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసే వరకూ ఉన్న ఆ ధీమా ఉపసంహరణ పర్వం ముగిసే ముందు రోజు నుంచి పూర్తిగా సడలిపోయింది. స్వతంత్ర అభ్యర్థులుగా నలుగురు టిడిపి వ్యూహం ప్రకారమే బరిలో ఉండటం, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే వరకూ వారు అందుబాటులో లేకుండాపోవడం, అందుబాటులో ఉన్నా వైసిపి నేతల ఒత్తిడికి తలొగ్గకపోవడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఇదే సమయంలో మరికొన్ని సమస్యలు వైసిపి అభ్యర్థులను, నేతలను చుట్టుముట్టాయి. ప్రధానంగా స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, వాలంటీర్ల వ్యవస్థతో వారికి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం తదితర అంశాలపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో పెద్దఎత్తున నెలకొంది. చివరకు అధికారులు సైతం తమ మాట వినడం లేదనే భావన అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువగా ఉంది. దీనికి నిదర్శనం సాక్షాత్తూ జెడ్‌పి సమావేశంలోనే అధికార పార్టీకి చెందిన నరసాపురం జెడ్‌పిటిసి తాను అడిగిన పనులకు నిధులివ్వాలని జెడ్‌పి ఛైర్మన్‌ చెప్పినా జెడ్‌పి సిఇఒ నిధులు మంజూరు చేయడం లేదని అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేయడమే. దీంతో ఎంఎల్‌సి అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంక రవీంద్రనాధ్‌ పరిస్థితిని వైసిపి పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎంఎల్‌సి ఎన్నికల ఓటింగ్‌ పద్దతి వేరేగా ఉండటం, ప్రథమ ప్రాధాన్యత ఓటుతోపాటు రెండో ప్రాధాన్యతా ఓటు కోసం టిడిపి నేతలు పకడ్బందీగా ముందుకెళ్తున్నట్లు సమాచారం ఉండటంతో ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక ఎంఎల్‌సి స్థానం కచ్ఛితంగా కోల్పోవాల్సి వస్తుందని అధిష్టానం వద్ద స్పష్టం చేసినట్లు సమాచారం. అదే సమయంలో డెల్టా ప్రాంతంలో కొంత అసంతృప్తులను బుజ్జగించి దారిలోకి తెచ్చే అవకాశం ఉన్నా మెట్ట ప్రాంతంలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఏలూరు నగర పాలక సంస్థలో విబేధాలు, చింతలపూడి నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ, ఎంపీల గ్రూపు తగాదాలతోపాటు ఏలూరు జిల్లా ప్రాంతానికి మంత్రి పదవులు లేకపోవడం, ఎంఎల్‌సిగా ఒక్కరికీ ఈ ప్రాంతం నుంచి అవకాశం కల్పించకపోవడం తదితర పరిణామాలు తమ గెలుపు నల్లేరు మీద నడక కాదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో అధికారపక్షానికి స్థానిక సంస్థల్లో మంచి మెజార్టీఉన్నా ఎంఎల్‌సి స్థానం ఒకటి కోల్పోయే ప్రమాదం ఉందనే సమాచారంతో అధిష్టానం సైతం ఒకింత అప్రమత్తమైనట్లు సమాచారం. మండలస్థాయిలో జెడ్‌పిటిసి, ఎంపిపితోపాటు మరో ముఖ్యనేతతో త్రిసభ్య కమిటీ తరహాలో ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాల ఎంఎల్‌ఎలకు పూర్తి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఓటింగ్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముందుగానే వివరించాలని భావిస్తున్నట్లు సమాచారం. రెండు, మూడో ప్రాధాన్యత ఓట్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించడంతోపాటు పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఆయా క్యాంపుల్లోనే నమూనా పోలింగ్‌ నిర్వహించి లోపాలను సరిదిద్దడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో క్యాంపు రాజకీయాలను నియోజకవర్గాలవారీ నిర్వహించాలని, చివరి రెండు రోజులు డివిజన్‌స్థాయిలోకి మార్చి పోలింగ్‌ కేంద్రానికి నేరుగా తమ ఓటర్లను తీసుకురావాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో నెలకొన్న అసంతృప్తి, తగాదాలను పరిష్కరించే బాధ్యత పూర్తిగా ఎంఎల్‌ఎల భుజస్కంధాలపై ఉంచాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. అదే సమయంలో రాజమండ్రి జిల్లాలో విలీనమైన కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌ మండలాల్లో ఓటింగ్‌ బాధ్యత హోం శాఖా మంత్రి తానేటి వనిత పర్యవేక్షించినా ఏలూరు జిల్లాలో బాధ్యత మాత్రం రాష్ట్రస్థాయి సీనియర్‌ నేతకు అప్పగించాలని అభ్యర్థులు ఇరువురు అధిష్టానానికి విన్నవించినట్లు సమాచారం. మొత్తానికి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న తెలుగు తమ్ముళ్లు వైసిపి నేతల్లో గుబులు పుట్టిస్తున్నారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలు ఎలాగున్నా అన్నిరకాలుగా బలం కలిగి ఉన్నా అధికారపక్షంలో కలవరం సృష్టించడం ప్రతిపక్షాల విజయంగానే చెప్పుకోవచ్చు. ఏదేమైనా వచ్చే సంవత్సరం సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంఎల్‌సి ఎన్నికలు అధికార పార్టీ ఎంఎల్‌ఎలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయడంలో ఎటువంటి సందేహమూ లేదు. పోలింగ్‌ సమీపించేసరికి ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.