
ప్రజాశక్తి - రామచంద్రపురం
ఎంఎల్‌సి తోట త్రిమూర్తులుపై వేగుళ్ల లీలాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని పలువురు కాపు నాయకులు హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని అరిగెల వీర రాఘవులు కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జగన్నాయకులపాలెం సర్పంచ్ అనిశెట్టి రామకృష్ణ, నారపరెడ్డి బలరాం, కంచుమర్తి బాబూరావు, కాజులూరు కాపు నేత వంగా రంగా, మాజీ కౌన్సిలర్లు పెంటపాటి శ్రీనివాస్‌రావు, పోతంశెట్టి గోపాల కృష్ణ, సాక్షి వేణు, బి.వెంకటరమణ ఈ సమావేశంలో మాట్లాడారు. రామచంద్రపురం నియోజక వర్గాన్ని భ్రష్టు పట్టించారని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కాపులను అణిచివేశారని, దాక్షారామంలో కాపు కళ్యాణ మండపం విషయంలో కాపులకు తీరని అన్యాయం చేశారని, అలాగే పల్లిపాలెంలో అమాయకుల భూములను తోట త్రిమూర్తులు దౌర్జన్యంగా లాక్కున్నారని జనసేన మండపేట నియోజక వర్గం కో-ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకష్ణ మాట్లాడటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్‌సి తోట రామచంద్రపురానికి ఆర్‌డిఒ కార్యాలయం, ఆర్‌టిఒ కార్యాలయాలను తీసుకొచ్చారన్నారు. పట్టణంలో మెయిన్ రోడ్డు అభివృద్ధి, స్థానిక ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి, ఎస్‌సి గురుకుల పాఠశాల, కృత్తివెంటి పేర్రాజు పంతులు అగ్రికల్చర్ కళాశాల, హార్టికల్చర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల తీసుకొచ్చిందని ఎంఎల్‌సి తోట త్రిమూరులేనని గుర్తు చేశారు. జడ్‌పి వైస్ చైర్మన్, నీటి సంఘాల అధ్యక్షులుగా పలువురు కాపులకు పదవులను ఇప్పించారన్నారు. ఎంఎల్‌సి తోటను కులం పేరుతో విమర్శిస్తే ఇకపై కాపులు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. త్రిమూర్తులపై అవాకులు చవాకులు పేలడం ఆపకపోతే నియోజక వర్గంలోని కాపులు వల్లూరులో లీలాకృష్ణ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కవల నానాజీ, గంటా సత్తిబాబు, వెలిది శేషారావు, అరిగెల శ్రీనివాసు, పిట్టా నాని, ఉండి సత్తిబాబు, ఆకుల పెద్ద, పెమ్మిరెడ్డి దొరబాబు, తదితరులు పాల్గొన్నారు