Feb 16,2023 21:29

నోటిఫికేషన్‌ విడుదల చేసిన రిట్నరింగ్‌ అధికారి
23వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ
24న పరిశీలన, 27 వరకూ విత్‌డ్రా పర్వం
మొత్తం 1,105 మంది ఓటర్లు
ఉమ్మడి జిల్లాలో ఐదు పోలింగ్‌ కేంద్రాలు
ఎన్నికల బరిలోకి స్వతంత్ర అభ్యర్థులు
టిడిపి, జనసేన అండ ఉండనున్నట్లు ప్రచారం
ఖరారు కాని అధికార పార్టీ అభ్యర్థుల పేర్లు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. గురువారం ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. 24న నామినేషన్ల పరిశీలన, 27 వరకూ విత్‌డ్రాల ప్రక్రియ సాగనుంది. అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను ఎన్నికల అధికారి జెసి, ఆయన లేనిపక్షంలో డిఆర్‌ఒ స్వీకరించనున్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ జరగనుంది. శివరాత్రి, ఆదివారం సెలవు దినాలు కావడంతో నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఎంఎల్‌సి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే నోడల్‌ అధికారుల నియామక ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 1,105 మంది ఓటర్లు ఉన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నరసాపురం, భీమవరం మండలాల్లోని ఎంపిడిఒ కార్యాలయాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏలూరులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో 249 మంది ఓటర్లు, జంగారెడ్డిగూడెం కేంద్రంలో 184 మంది, కొవ్వూరులో 242 మంది, నరసాపురంలో 229 మంది, భీమవరం పోలింగ్‌ కేంద్రంలో 201 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ సాగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. నామినేషన్ల విత్‌డ్రా ప్రక్రియ 27వ తేదీన ముగియనుంది. ఆ రోజు సాయంత్రం ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు ఎవరో స్పష్టత రానుంది.
ఏకగ్రీవమా.. ఎన్నికలేనా..?
జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించిన రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అత్యధికులు అధికార పార్టీ వైసిపికి చెందిన వారే. దీంతో రెండు స్థానాలూ వైసిపికి సొంతమయ్యే అవకాశం ఉంది. అయితే ఎన్నికల ప్రక్రియ ఏకగ్రీవంగా ముగుస్తుందా.. ఎన్నికలు జరుగుతాయా అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. రెండు ఎంఎల్‌సి స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై అధికార వైసిపి ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేదు. అయితే టిడిపి నుంచి పార్టీలో చేరిన బిసి అభ్యర్థి జయమంగళ వెంకటరమణకు ఒక స్థానం ఖరారైనట్లు వైసిపి నేతలు చెబుతున్నారు. రెండో అభ్యర్థికి సంబంధించి పాలకొల్లుకు చెందిన గుణ్ణం నాగబాబు పేరు ప్రముఖంగా విన్పిస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడితే తప్ప స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదే తరుణంలో టిడిపి నుంచి అభ్యర్థులు ఎవరైనా పోటీలో ఉంటారా అనే చర్చ సైతం నడుస్తోంది. టిడిపి అధినాయకత్వం నుంచి మాత్రం ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీపై ఎటువంటి ఆదేశాలూ రాలేదని తెలుస్తోంది. ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీకి 14 మంది వరకూ స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. స్వతంత్ర అభ్యర్థుల్లో బలమైన వ్యక్తికి పరోక్షంగా టిడిపి, జనసేన మద్దతు తెలిపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఎంఎల్‌సి ఎన్నికలు ఉత్కంఠ రేపనున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో సులువుగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేరేవైపు మొగ్గు చూపకుండా చూసుకోవడం సవాలుగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచే బలం ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మేకా శేషుబాబు ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి ఉంది. దీంతో ఎన్నికలు జరిగితే మాత్రం అధికార పార్టీకి టెన్షన్‌ తప్పదన్నట్లు చర్చ నడుస్తోంది.