Feb 14,2023 21:45

అధికారపక్షంలో అసంతృప్త జ్వాలలు
ఆది నుంచి కష్టపడిన నేతలకు అధినాయకత్వం ఝలక్‌
జయమంగళ, కరాటంలకు ఎంఎల్‌సి పదవుల ప్రచారంపై జిల్లా నేతల్లో ఆగ్రహం
పార్టీని దెబ్బతీస్తున్నారంటూ వైసిపి శ్రేణుల విమర్శలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఎంఎల్‌సి పదవుల వ్యవహారం వైసిపిలో ముసలం రేపుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడినోళ్లను పక్కనపెట్టి వేరే పార్టీల నేతలకు పదవులు కట్టబెట్టే ఆలోచనపై జిల్లాలోని వైసిపి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సమయంలో అధినాయకుడు చెప్పిన మాటలకు, ప్రస్తుత పరిణామాలకు పొంతన లేకపోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మడమ తిప్పం.. మాట తప్పం అని చెప్పిన నాయకుడు ప్రస్తుతం సొంత పార్టీలో కష్టపడిన నాయకులను పక్కనపెట్టి వేరే పార్టీలో నాయకులను పిలిచి మరీ పదవులు కట్టబెట్టడం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల 16న స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో అత్యధికం వైసిపికి చెందిన వారే. దీంతో రెండు ఎంఎల్‌సి పదవులు వైసిపికే దక్కనున్నాయి. దీంతో పార్టీలో ఆది నుంచి కష్టపడుతున్న నాయకులంతా ఎంఎల్‌సి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఒకటి బిసి, రెండో పదవి జనరల్‌కు ఇస్తారనే ప్రచారం సాగింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఎంఎల్‌సి పదవులపై వైసిపి అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో కైకలూరులో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలైన టిడిపి నాయకుడు జయమంగళ వెంకటరమణకు ఎంఎల్‌సి పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. సిఎం జగన్‌ను కలిశానని, ఎంఎల్‌సి పదవిపై భరోసా ఇచ్చారని జయమంగళనే చెబుతున్నారు. జయమంగళకు భద్రత పెంచడం దీనికి బలం చేకూరుస్తోంది. వైసిపిలోనూ వడ్డి సామాజిక తరగతికి చెందిన నేతలన్నారు. వీరు కూడా ఎంఎల్‌సి పదవి ఆశిస్తున్నారు. హఠాత్తుగా టిడిపిలో ఉన్న నేతను పిలిచి పదవి కట్టబెట్టడాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రీ పగలు పార్టీ కోసం కష్టపడటం ఎందుకని వారంతా ప్రశ్నిస్తున్నారు. జగన్‌ పార్టీ పెట్టిన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను వదిలి వైసిపితో అడుగులు వేసిన నేతలకు ఇప్పటికీ గుర్తింపు లేకుండా పోయింది. టిడిపి ప్రభుత్వ హయాంలోనూ వీరంతా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడ్డారు. అలాంటి నాయకులను వైసిపి అధిష్టానం ఏమాత్రం పట్టించుకోకపోవడం అందరినీ తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఎంఎల్‌సి పదవి ఆశిస్తున్న నేతలంతా పార్టీ అగ్రనేతలను కలిసి గట్టిగానే దీనిపై మాట్లాడినట్లు సమాచారం. కొంతమంది నేతలైతే కళ్లనీళ్లు పెట్టుకున్నట్లు కూడా తెలుస్తోంది. జయమంగళ చేరికతో లాభం సంగతి అటుంచి పెరుగుతున్న అసంతృప్తితో వైసిపికి తీవ్రం నష్టం తప్పదనే అభిప్రాయం వైసిపి నేతల్లో వ్యక్తమవుతోంది.
రెండో పదవికి పరిశీలనలో కరాటం రాంబాబు?
జిల్లాలోని రెండు ఎంఎల్‌సి పదవుల్లో ఒకటి టిడిపి నుంచి రానున్న బిసి నేత జయమంగళ వెంకటరమణకు ఇవ్వనున్నట్లు ఇప్పటికే కొంత స్పష్టత వచ్చింది. రెండో ఎంఎల్‌సి పదవి మెట్ట ప్రాంతంలో ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించి డిసిసిబి ఛైర్మన్‌గా పని చేసిన కాపునేత కరాటం రాంబాబుకు ఇవ్వనున్నట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కరాటం రాంబాబు కాంగ్రెస్‌లో కూడా చురుగ్గా లేరు. దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ కాపు కోటాలో కరాటం రాంబాబుకు ఎంఎల్‌సి పదవి ఇవ్వాలని వైసిపి అధిష్టానం చూస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే కొంత చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కరాటం రాంబాబుకు ఎంఎల్‌సి పదవి ఇవ్వడంపై స్థానిక వైసిపి నేతలు అభ్యంతరం చెబుతున్నట్లు తెలిసింది. రెండో పదవి కరాటం రాంబాబుకు ఇస్తే పార్టీలో ఎంఎల్‌సి పదవి ఆశిస్తున్న నాయకులకు మొండిచెయ్యి చూపించినట్లే. ఏదేమైనా ఎంఎల్‌సి పదవుల వ్యవహారం వైసిపిలో పెద్దఎత్తున ముసలం రేపే పరిస్థితి కన్పిస్తోంది. కాపు కోటాలో గుణ్ణం నాగబాబుకు ఎంఎల్‌సి పదవి ఇవ్వాలని జిల్లాలోని ముఖ్యనేతలు అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీనిపైనా వైసిపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కీలక సమయంలో పార్టీని వీడి అధికారంలోకి వచ్చాక మళ్లీ తిరిగొచ్చిన వారికి ఏవిధంగా ఎంఎల్‌సి పదవి కట్టబెడతారనే ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వెల్లువెత్తుతుండటం గమనార్హం. ఏదేమైనా అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.