Mar 23,2023 21:19

రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుపు - తొలుత ఓడినట్లు ప్రచారం - పంచుమర్తి అనురాధ గెలుపుతో టిడిపి నేతల్లో జోష్‌
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

         ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో వైసిపి తరపున జయమంగళ వెంకటరమణ విజయం సాధించారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయన గెలుపొందారు. వైసిపి నుంచి పోటీ చేసిన ఏడుగురు ఎంఎల్‌సి అభ్యర్థులకు ఒకొక్కరికి మొదటి ప్రాధాన్యతా ఓటుగా 22 ఓట్లు రావాల్సి ఉండగా జయమంగళకు, మరో ఎంఎల్‌సి అభ్యర్థి కోలా గురువులకు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో జయమంగళకు వైసిపి ఎంఎల్‌ఎలు ఝలక్‌ ఇచ్చారంటూ ప్రచారం సాగింది. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సందర్భంగా కోలా గురువులు గెలిచినట్లు ముందు ప్రచారం సాగింది. కొద్దిసేపటి తర్వాత రెండోప్రాధాన్యత ఓటుతో జయమంగళ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు.
టిడిపిని వీడి వైసిపి నుంచి గెలుపు
జయమంగళ వెంకటరమణ రాజకీయ నేపథ్యం అంతా టిడిపితోనే కొనసాగింది. అనూహ్యాంగా ఎంఎల్‌సి ఎన్నికల ముందు వైసిపిలో చేరి ఎంఎల్‌సిగా గెలుపొందారు. 2004లో టిడిపి తరపున జెడ్‌పిటిసిగా జయమంగళ గెలిచారు. 2009 ఎన్ని కల్లో టిడిపి తరపున ఎంఎల్‌ఎ అభ్యర్థిగా కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో జయమంగళ టిక్కెట్‌ ఆశించి నప్పటికీ బిజెపి, టిడిపి పొత్తులో భాగంగా కామినేని శ్రీని వాస్‌ బిజెపి తరపున కైకలూరు నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో మళ్లీ టిడిపి తరపున జయ మంగళ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆయన పని చేస్తున్నారు. ఎంఎల్‌సి ఎన్నికల ముందు అనూ హ్యాంగా జయమంగళ ఎంఎల్‌సి పదవి హామీతో వైసిపిలోకి జంప్‌ అయ్యారు. ఎంఎల్‌ఎ కోటా ఎన్నికల్లో ఎంఎల్‌సిగా వైసిపి తరపున పోటీచేశారు. గురువారం జరిగిన ఎన్నికల్లో జయమంగళ వెంకటరమణ ఎంఎల్‌సి గెలుపొందారు.
అనురాధ గెలుపుతో టిడిపి శ్రేణుల్లో జోష్‌
ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ గెలుపొందడంతో టిడిపి శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఎంఎల్‌సి ఎన్నికల్లో కొనసాగిన ఉత్కంఠనే అందుకు కారణంగా చెప్పొచ్చు. క్రాస్‌ఓటింగ్‌ ప్రభావంతో జయమంగళ వెంకటరమణ గెలుపుపై దోబూచులాట నెలకొంది. రెండో ప్రాధాన్యతా ఓటుతో గెలవడంతో జయమంగళ ఊపిరి పీల్చుకున్నారు.