Mar 30,2023 21:57

దెందులూరు మండలం దోసపాడు దళితుల ఆవేదన
ఏడాదిగా అసైన్డ్‌ భూముల కోసం పోరాడుతున్న పేదలు
కనీసం పట్టని దెందులూరు ఎంఎల్‌ఎ అబ్బాయిచౌదరి
ఓట్లకు మాత్రమే మేం పనికొస్తామా అంటూ దళితుల వేదన
రెండుసార్లు అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇవ్వలేదని నిర్వేదం
         దళితులు మా పార్టీకి వెన్నెముక అంటూ వైసిపి పదేపదే చెబుతోంది. అలాంటి దళితులకు కష్టం వస్తే మాత్రం ఆ పార్టీ ఎంఎల్‌ఎలకు పట్టకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. దెందులూరు మండలం దోసపాడులోని దళితులు తమ అసైన్డ్‌ భూముల కోసం ఏడాదికిపైగా పోరాటం చేస్తున్నప్పటికీ దెందులూరు ఎంఎల్‌ఎ కనీసం పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. కనీసం కలిసేందుకు ఎంఎల్‌ఎ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం బాధితులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. తమ భూములు తమకు ఇప్పించాలంటూ గత కొన్నిరోజులుగా బాధిత దళిత కుటుంబాలు గ్రామంలో నిరవధిక దీక్షలు చేస్తున్నాయి. ఎంఎల్‌ఎ గారూ.. ఇప్పటికైనా మా గోడు పట్టించుకోండంటూ వారంతా కోరుతున్నారు.
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

                దెందులూరు నియోజకవర్గంలోని దోసపాడు గ్రామంలోని దళిత కుటుంబాలు తమ అసైన్డ్‌ భూముల సమస్యపై ఏడాదిగా అలుపెరుగని పోరాటం చేస్తున్నా స్థానిక ఎంఎల్‌ఎ అబ్బాయిచౌదరికి పట్టకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ సమస్యను చెప్పుకోవాలని ఎంఎల్‌ఎను కలిసేందుకు ప్రయత్నించిన దళితులకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడం అందరినీ విస్మయపరుస్తోంది. పేదలకు అండగా నిలవాల్సిన ఎంఎల్‌ఎ తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దోసపాడులో దళితులకిచ్చిన అసైన్డ్‌ సీలింగ్‌ భూములు దాదాపు 350 ఎకరాల వరకూ ఉన్నాయి. 1957 నుంచి దఫదఫాలుగా ఈ భూములను ప్రభుత్వం దళితులకు ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. సర్వే నెంబర్లు 208, 213, 214, 216, 225, 226, 227, 231, 232ల్లో ఈ భూములున్నాయి. ప్రస్తుతం ఈ భూములన్నీ విజయవాడకు చెందిన దేవినేని బాజీప్రసాద్‌, ఆయన అనుచరుల చేతుల్లో ఉన్నాయి. ఈ భూములన్నీ ప్రస్తుతం చేపలు, రొయ్యల చెరువులుగా మారిపోయాయి. అప్పట్లో తమను ప్రలోభపెట్టి ఈ భూములను కాజేశారని భూములకు సంబంధించిన దళితులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం అసైన్డ్‌, సీలింగ్‌ భూములకు సంబంధించి క్రయవిక్రయాలు నిషిద్ధం. తమ భూములు తమకు అప్పగించాలని ఏడాదిగా దాదాపు 50కి పైగా దళిత కుటుంబాలు పోరాటం చేస్తున్నాయి. కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలు, పాదయాత్రలు, అధికారులకు వినతిపత్రాలు ఇలా అనేక రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తమ సమస్యను పరిష్కరించాలని గడిచిన వారంరోజులుగా గ్రామంలోని సచివాలయం వద్ద బాధిత దళితులంతా నిరవధిక దీక్షలు చేస్తున్నారు.
నియోజకవర్గ ప్రజల సమస్య ఎంఎల్‌ఎకు పట్టదా..?
నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఏడాదిగా రోడ్డెక్కి ఓ సమస్యపై పోరాటం చేస్తున్నా స్థానిక ఎంఎల్‌ఎకు ఎందుకు పట్టడం లేదో ఏఒక్కరికీ అర్థం కావడం లేదు. కనీసం సమస్య ఏమిటంటూ అడిగిన దాఖలాలు లేకుండాపోయాయి. ఏడాదిగా పోలీసులు బాధిత దళితులపై తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నారు. తమ గోడు ఎంఎల్‌ఎకు చెప్పుకుందామని ఆయనను కలిసేందుకు ప్రయత్నించిన బాధిత దళితులకు ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని తెలిసింది. ఈ నెల 25న దెందులూరులో సిఎం పర్యటన సాగింది. తమ సమస్యను సిఎంకు చెప్పుకునేందుకు అవకాశం కల్పించాలని ఎంఎల్‌ఎను అడిగేందుకు ప్రయత్నించినా ఫలించలేదని తెలిసింది. దళితులు ఓట్లు వేసేందుకు మాత్రమే పనికొస్తారా అంటూ బాధితుల ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సి ఉంది. 2015లో లోకాయుక్త కోర్టు కూడా ఈ భూములను దళితులకు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ పేదలైన దళితులకు న్యాయం జరగని పరిస్థితి నెలకొంది. దేవినేని బాజీప్రసాద్‌ కుటుంబం వైసిపిలో ఉండటం కారణంగానే ఎంఎల్‌ఎ తమను పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. గ్రామం మీదుగా ఎంఎల్‌ఎ అటువైపుగా వెళ్లినా తమను పట్టించుకోవడం లేదని దళితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గత టిడిపి ప్రభుత్వంలోనూ ఇదే నియోజకవర్గంలో దళితులు అనేక సమస్యలపై రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. అప్పటి ఎంఎల్‌ఎ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి కొనసాగింది. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొనడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రతిపక్షంలో ఉండగా ఒకలా, అధికారంలోకొచ్చాక మరోలా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధుల తీరు అందరినీ నివ్వెరపరుస్తోంది.