Nov 08,2023 00:55

ప్రజాశక్తి - ఇంకొల్లు
చిన్నగంజాం మండలంలోని గొనసపూడి నుంచి ఇంకొల్లు మండలం పావులూరు పొలిమేర ఆంజనేయస్వామి ఆలయం వరకు ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు తలపెట్టిన మహా పాదయాత్ర నిర్వహించారు. గొనసపూడి, ఇంకొల్లులో సాయంత్రం వర్షం పడుతున్నా కూడా పాదయాత్ర సాగించారు. సందర్భంగా ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ చంద్రబాబు పాలన రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. 150సీట్లు సాధించిన సిఎం జగన్ పాలన చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక విధాల వేధిస్తున్నారని అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి వేధించటమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. రైతులు వర్షాభావంతో పంటలు ఎండిపోతూ అల్లాడుతున్నప్పటికీ తాను మాత్రం పట్టిసీమతో కొమ్మూరు కాల్వ ద్వారా నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ నేటి వరకు నీరు ఇవ్వకుండా పంటలను ఎండగట్టాలని ఆరోపించారు. ప్రజలలో తిరుగుబాటు గమనించి ప్రస్తుతం నీరు వదిలే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇంకొల్లులో ఎన్టీఆర్ బొమ్మ నిర్మాణానికి విక్రం నారాయణరావు పూర్తి సహాయ సహకారాలు అందించారని అన్నారు. పార్టీలకతీతంగా గొనసుపూడి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముందున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఫారం7 ద్వారా అక్రమంగా ఓట్లు తొలగించే ప్రక్రియకు తెరతీశారని అన్నారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లు, ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని ఇక్కడ లేనట్లు, జీవనరీత్యా వలస వెళ్లిన వారిని, ఉద్యోగరీత్యా పోయిన వారిని శాశ్వతంగా తప్పిపోయినట్లు సృష్టించి అభ్యంతరం పెట్టారని అన్నారు. నియోజకవర్గంలో 14వేల ఓట్లపైగా ఫారం7 ఉపయోగించారని తెలిపారు. అక్రమ తొలగింపులపై కోర్టును ఆశ్రయించడంతో అక్రమాలకు పాల్పడిన అధికారులు కొందరు సస్పెండ్ అయ్యారని అన్నారు. అక్రమంగా ఓట్ల తొలగింపుకు పాల్పడిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని అన్నారు. యాత్ర మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు. తొలుత గొనసపూడి నుంచి ప్రారంభమైన యాత్ర అక్కడ ఆలయాలలో పూజ చేసి బయలుదేరారు. కడవకుదురు రోడ్డు మీద భీమవరం నాగేంద్ర స్వామి పుట్ట వద్దకు చేరకుని అక్కడి నుంచి ఇంకొల్లు బయలుదేరారు. ఇంకొల్లులో అంబేద్కర్, జగజీవన్‌రాం విగ్రహాలకు నివాళులర్పించారు. అక్కడి నుండి పొలిమేర ఆంజనేయ స్వామి వద్దకు చేరి యాత్రను ముగించారు. దాదాపు 17 కిలోమీటర్ల యాత్ర కొనసాగింది. యాత్రలో ఆయన వెంట ఇంకొల్లు, చినగంజాం, కారంచేడు మండలాల టిడిపి అధ్యక్షులు పొద వీరయ్యచౌదరి, హనుమంతరావు, తిరుమలశెట్టి శ్రీహరి, వాణిజ్య విభాగం పార్లమెంటు అధ్యక్షులు కొండ్రగుంట శ్రీహరిబాబు, యువ పారిశ్రామికవేత్త విక్రం నారాయణరావు, గొనసపూడి సర్పంచ్ విక్రమ్ దీప్తితో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.