Nov 01,2023 19:59

ఎండిపోయిన పంట పొలాలను చూపుతున్న మహిళా రైతులు

వీరఘట్టం:  ఆరుగాలం ఎంతో కష్టించి, శ్రమించడంతో పాటు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేసినప్పటికీ వర్షాభావ పరిస్థితుల కారణంగా చేతికి అంది వచ్చే పంట కళ్లముందే ఎండిపోవడంతో అన్నదాతలు కంటతడి పెడుతున్నారు. మండలంలోని నీలంపేట, వంకాయలగెడ్డ, గదబవలస, హుస్సేన్‌పురంకు చెందిన రైతులు కూరంగి సరోజిని, నారాయణపురం నీలశెట్టి, నాసు భోగమ్మ, పక్కి గౌరమ్మ, పొట్నూరు సుందరమ్మ, పుష్ప, తెగల శాంతమ్మ, తలచింతల సావిత్రమ్మ, రాయిల దాలమ్మ, తాతబాబు, గొర్ల పెద్ద సీతయ్య, తదితర రైతులకు చెందిన సుమారు 32 ఎకరాల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం పంట పొట్ట దశకు వచ్చినప్పటికీ కొంతకాలంగా వర్షాలు కురవకపోవడంతో చేతికందే వచ్చే పంట ఎండ వేడిమి తట్టుకోలేక మాడిమసైపోయింది. అలాగే నిత్యం ఆరుతడితో ఉండాల్సిన భూమి కూడా ఎక్కడికక్కడ బీటలు వారి దర్శనమిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, దుక్కులు, గాపుతీయడాలు ఎకరాకు సుమారు రూ.20వేలు పైబడి పెట్టుబడులు పెట్టినట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు వరుణదేవుడు తనపై జాలి చూపకపోవడంతో పచ్చగా ఉండాల్సిన పంటలు ఎండిపోయి దర్శనం ఇవ్వడంతో పంటలపై ఎన్నో ఆశలు పెట్టుకొని సాగు చేసినప్పటికీ ఆశలు నిరాశ మిగిలిందని అన్నదాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు అప్పులు చేసి మదుపులు పెట్టామని, ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్ధంకాక అయోమయంలో రైతులు పడ్డారు. ఈమేరకు ఎండిపోయిన పంటలను మండలం వ్యవసాయ అధికారి జక్కువ సౌజన్య పరిశీలించారు.