
ఎండుతున్న మెట్ట పంటలు
- వర్షం కోసం రైతన్నల ఎదురుచూపు
- బనగానపల్లె మండలంలో 40 శాతం మాత్రమే సాగు
ప్రజాశక్తి - బనగానపల్లె
ఆరుగాలం కష్టపడే రైతులు ఏటా అతివృష్టి, అనావృష్టితో నష్టపోతునే ఉన్నారు. ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఇటీవల అరకొర వర్షాలు పడినా పూర్తిస్థాయిలో అదను కాకపోవడంతో 15 రోజులకే రైతులు సాగు చేసిన కంది, కొర్ర పంటలు ఎండిపోతున్నాయి. మండలంలో 45 వేల ఎకరాల సాగు భూమి ఉంది. ఈ ఖరీప్‌లో 24,250 ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉంది. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో ఇప్పటివరకు 10,250 ఎకరాల్లో మాత్రమే పంటలను సాగు చేసినట్లు వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. మండలంలోని కటికవానికుంట, ఫతేనగరం, పసుపుల, పెద్దరాజుపాలెం, చిన్నరాజుపాలెం, క్రిష్ణగిరి, చెర్లో కొత్తూరు, జోలాపురం, పాతపాడు, మీరాపురం, యాగంటి పల్లె, యనకండ్ల ఎర్రగుడి, హుస్సేనాపురం, రామకృష్ణాపురం, రాళ్ల కొత్తూరు తదితర గ్రామాలలో కంది 3405 ఎకరాలు, కొర్ర 375 ఎకరాలు, పత్తి 450 ఎకరాల్లో వర్షాధారం కింద రైతులు పంటలను సాగు చేశారు. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 65.3 మి.మీ గాను 42.8 మి.మీ, జూలైలో 106.3 మి.మీ గాను 99.4, ఆగస్టులో 116.4 మి.మీ గాను 62.8 మి.మీ వర్షపాతం నమోదయింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షం కురవడంతో రైతులు ఖరీఫ్‌లో సాధారణ సాగు కంటే తక్కువగా సాగు చేశారు. దీనికి తోడు ఎస్‌ఆర్‌బిసి కాల్వకు నీరు రాకపోవడంతో కాల్వ కింద రైతులు పంటలు సాగు చేయలేదు. సెప్టెంబర్ నెలలో ఒక మోస్తరు వర్షాలు కురిసినా పూర్తిస్థాయిలో అదును కాకపోవడంతో వర్షం కురిసిన 15 రోజులకే పంటలు వాడుముఖం పడుతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులు పంటలను సాగు చేస్తే వర్షాలు లేక ఎండిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బోర్లు, బావుల కింద రైతులు మొక్కజొన్న, పత్తి, మిరప, వరి పంటలను సాగు చేయగా బోర్లలో భూగర్భ జలాలు ఇంకిపోయి పంటలకు నీరుందని పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాలలో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం బనగానపల్లె ప్రాంతాన్ని కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
ఆరు ఎకరాలలో కంది, మూడు ఎకరాల్లో కొర్ర పంటలను సాగు చేశాను. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. ప్రభుత్వం ఆదుకోవాలి.
- పర్లపాటి నాగార్జున, రైతు కటికవానికుంట.
కరువు మండలంగా ప్రకటించాలి
మండలంలో వేల ఎకరాలలో రైతులు సాగు చేసిన పంటలు వర్షాలు లేక ఎండిపోతున్నాయి. ప్రభుత్వం బనగానపల్లె మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి. మెట్ట ప్రాంత పంటలకు ఎకరానికి రూ.30 వేలు, బోర్లు, బావుల కింద సాగు చేసి ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.
- జెవి.సుబ్బయ్య, సిపిఎం మండల కార్యదర్శి.