Aug 27,2023 21:09

బోరు ఎండిపోవడంతో నీరందక బీటలు వారిన వరి పొలంలో దిగాలుగా కూర్చున్న రైతు

ఎండుతున్న బోర్లు, బావులు
- నీరందక ఎండిపోతున్న పంటలు - వర్షం కోసం రైతన్నల ఎదురుచూపులు
ప్రజాశక్తి - బనగానపల్లె

      ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్న పరిస్థితి దీనంగా మారింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా వర్షాలు లేకపోవడంతో బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. వర్షం కోసం రైతన్న మేఘాల వైపు దీనంగా చూస్తున్నాడు. వేల రూపాయలు అప్పులు చేసి పంటలను సాగు చేస్తే వర్షాలు లేక బోర్లలో భూగర్భ జలాలు ఎండిపోయి పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మదన పడుతున్నాడు.
బనగానపల్లె మండలంలో ఆయా గ్రామాల్లో బోర్లు, బావుల కింద సాగు రైతులు వరి 2 వేల ఎకరాలు, మొక్కజొన్న 3 వేల ఎకరాలు, మిరప 2500 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు ఇంకిపోయి నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోతుండడంతో దిక్కుతోచని రైతులు పశువులను మేతగా మేపుతున్నారు. వేల రూపాయలు అప్పులు చేసి పంటలను సాగు చేస్తే మొక్కజొన్న పంట చేతికి వచ్చిన సమయంలో నీళ్లు లేక ఎండిపోతుండడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతం. మొక్కజొన్న ఎకరానికి రూ. 40 వేలు అప్పు చేసి సాగు చేస్తే నెల రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లు లేక ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు. వరి ఎకరానికి రూ.30 వేలు ఖర్చు చేసి సాగు చేస్తే నీళ్లు లేక భూమి బీటలు వారి ఎండిపోతుందని, అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు మదన పడుతున్నారు. వరుణుడి కోసం కర్షకులు నింగివైపు చూస్తూ ఆశగా నిరీక్షిస్తున్నారు. మొదట్లో ఒక మోస్తారు వర్షాలు కురవడం వల్ల భూమిలో వేసిన విత్తనం మొలకెత్తి, ప్రస్తుతం మధ్యస్థ దశలో చేరుకుంది. వర్షాకాలం సీజన్‌ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా మళ్లీ చినుకు జాడ లేకపోవడంతో పంటలు కళ్ళ ముందే ఎండి పోతుంటే చూడలేక తల్లడిల్లిపోతున్నారు. కొందరు రైతులు పంటలు నష్టపోలేక, ఆశ చంపుకోలేక నీటి ట్యాంకులు సమకూర్చుకొని వాటి ద్వారా పైపులైన్లు ఏర్పాటు చేసుకొని పంటలకు నీటి తడిని పెట్టుకుంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అప్పులు చేసి ఎకరాకు రూ. 20 వేల చొప్పున ముందస్తు కౌలు డబ్బులు చెల్లించి, మరో రూ. 30 వేలు పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగు చేసిన పంటలు ఎలాగూ చేతికి దక్కే పరిస్థితి కనిపించడం లేదని, కనీసం పశువుల కడుపు అయినా నిండుతుందని, కష్టపడి సాగు చేసిన పంట పొలాలను కొందరు రైతులు పశువులకు మేతగా వదిలేశారు. ఖరీఫ్‌ సీజన్‌ లో సాగు చేసి నష్టపోయిన పంటలను ప్రభుత్వం తక్షణమే సర్వే జరిపించి, పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు పంట నష్టపహారం ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
ఎకరానికి 40 వేలు పెట్టుబడి పెట్టి 5 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశాను. బోర్లలో నీళ్లుఇంకిపోయి పంట ఎండి పోతుంది. నెలన్నరలో పంట చేతికి వచ్చేది. బోర్లలో నీళ్లు లేక పంట ఎండిపోతుంది. ప్రభుత్వం ఎకరానికి రూ. 50 వేలు పంట నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.
- రైతు భాస్కర్‌ రెడ్డి, యనకండ్ల గ్రామం.
వేసిన పంటలు ఎండిపోతున్నాయి
మూడు ఎకరాల్లో వరి, రెండు ఎకరాల్లో మిరప, నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాను. బోర్లలో నీళ్ళు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
- రైతు శ్రీనివాసరెడ్డి, యాగంటిపల్లె గ్రామం.