తలుపులు తెరచుకోగానే
బిగపట్టిన ప్రాణాలకు
ఒక్కసారిగా బిగువు సడలినట్టు
పంజరంలోని పక్షికి
విరామం ప్రకటించినట్టు
ఆగస్టు పదిహేను తేదీన
బానిస సంకెళ్ళు తెంచుకుని
స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నట్టు
కూడళ్ళు జనసమూహాలను
విచ్చలవిడిగా ప్రవహిస్తున్నాయి
కలుగులలో దాగున్న ఎలుకలన్నీ
ఒక్కసారిగా బారులు తీరినట్టు
పుట్టలు పుట్టలుగా
ఎక్కడపడితే అక్కడ జనం
ఏదో క్రిమిని పాతేసి
ఊపిరి పీల్చుకున్నట్టే
జయకేతనం ఎగరేసినట్టే
సడలించిన నిర్బంధం సాక్షిగా
రోడ్ల నదులన్నీ పోటెత్తుతున్నాయి
కడుపు నిండనితనం
ఎలాగైనా పనిమేఘమై
కురవక తప్పదు
ఉపాధి పోయినతనం సొంతూరివైపు
నెత్తుటిపాదమై సాగింది సరే
జేబులలో కనబడని శత్రువును
వాహకాలై మోసుకుపోతున్నామన్న
ఈ సృహలేనితనం మాటేమిటి?
పాము కాటు వేయడానికి
వేలమందిని మట్టుపెట్టడానికి
చేజేతులా రంగం
సిద్ధంచేస్తున్నారు వీళ్ళు
ఏమిటి వీరి విపరీతబుద్ధి
ఎక్కడిది వీరికీ తెంపరితనం
లాఠీల అలసట
చీపుర్ల శ్రమ
అంతా వృథా వృథా
పాటించమన్న దూరాలు
ఇన్నాళ్ళ జైలు
అన్నీ గాలికి కొట్టుకుపోతున్నాయి
క్రమశిక్షణలకు నిప్పంటుకుంది
బాధ్యతారాహిత్యం
వెర్రిగా నవ్వుతోంది
సమీప భవిష్యత్తులో
చూడాల్సిన విలయం
మూడోమారు బుసకొట్టడానికి
పుడమి కనురెప్పలను
కత్తులతో పొడుస్తూ....
ఇక సమాధులను
మోయలేనంటూ భూమి
ఆగిపోయే గండెలను తలచుకుని
గజగజా వణికిపోతూ....
పద్మావతి రాంభక్త
99663 07777